Nara Lokesh: అమరావతి రైతులపై లాఠీఛార్జ్.. నారా లోకేశ్ సీరియస్!
- హైకోర్టు అనుమతితో చేస్తున్న పాదయాత్రకు పోలీసులు ఆంక్షలు విధించడం ఏమిటి?
- రైతులపై లాఠీ ఛార్జ్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి
- గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలి
ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ ఆ ప్రాంత రైతులు, మహిళలు చేపట్టిన పాదయాత్రలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం చదలవాడ వద్ద రైతులకు స్వాగతం పలికేందుకు స్థానికులు ప్రయత్నించగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, స్థానికులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఈ ఘటనలో పలువురు రైతులు కూడా గాయపడ్డారు. ఇద్దరు రైతులకు చేతులు విరిగాయి.
ఈ నేపథ్యంలో టీడీపీ నేత నారా లోకేశ్ స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న వారిపై లాఠీఛార్జ్ చేయడం దుర్మార్గమని అన్నారు. హైకోర్టు ఉత్తర్వులను ధిక్కరిస్తూ రైతులపై లాఠీఛార్జ్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసుల దాడిలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని సూచించారు.
హైకోర్టు అనుమతితో చేస్తున్న పాదయాత్రకు పోలీసులు ఆంక్షలు విధించడం ఏమిటని దుయ్యబట్టారు. కవరేజ్ కోసం వచ్చిన మీడియాను ఎందుకు ఆపుతున్నారని ప్రశ్నించారు. మహాన్యూస్ ఎండీ వంశీని, ఇతర పాత్రికేయులను పోలీసులు అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు.