Andhra Pradesh: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల
- ఏపీలో 11, తెలంగాణలో 12 స్థానాలకు ఎన్నికలు
- నవంబర్ 16న నోటిఫికేషన్ విడుదల
- డిసెంబర్ 10వ తేదీన పోలింగ్
ఇరు తెలుగు రాష్ట్రాల్లో స్థానిక సంస్థల కోటాకు సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఏపీలో 11 ఎమ్మెల్సీ స్ధానాలకు, తెలంగాణలో 12 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలోని నిజామాబాద్, ఖమ్మం, మెదక్, నల్గొండ, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఒక్కో స్థానం చొప్పున... రంగారెడ్డి, కరీంనగర్, మహబూబ్ నగర్ జిల్లాల్లో రెండు స్థానాల చొప్పున ఖాళీలు ఉన్నాయి. వీటికి ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. దీంతో పాటు ఏపీలో ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు కూడా షెడ్యూల్ విడుదల చేసింది.
నవంబర్ 16న ఈ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల అవుతుంది. నవంబర్ 23 నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ. 24వ తేదీన నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు నవంబర్ 26 చివరి తేదీ. డిసెంబర్ 10న పోలింగ్ జరుగుతుంది. డిసెంబర్ 14న ఓట్ల లెక్కింపు జరుగుతుందని ఈసీ ప్రకటించింది.