Perni Nani: కొన్ని నెలలుగా వీరబాదుడు బాది ఇప్పుడు రూ.5 తగ్గిస్తారా?: కేంద్రంపై మంత్రి పేర్ని నాని ధ్వజం
- పెట్రో ధరల అంశంపై పేర్ని నాని ప్రెస్ మీట్
- బీజేపీ నేతలపైనా, చంద్రబాబుపైనా విమర్శలు
- ధరలు పెంచిన వాళ్లే ధర్నాలు చేస్తారా? అంటూ ఆగ్రహం
- టీడీపీ స్క్రిప్టునే బీజేపీ నేతలు చదువుతున్నారని ఆరోపణ
పెట్రో ధరల అంశంపై ఏపీ మంత్రి పేర్ని నాని కేంద్ర ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. పెట్రోల్ ధరను రూ.116 వరకు తీసుకెళ్లింది ఎవరు? అంటూ ప్రశ్నించారు. రూ.70 ఉండాల్సిన పెట్రోల్ ధరను ఎక్కడికి తీసుకెళ్లారు? అంటూ మండిపడ్డారు. పెట్రో ధరలు పెంచిన వాళ్లే రోడ్లపై ధర్నాలు చేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడి బీజేపీ నేతలు ఢిల్లీ నార్త్ బ్లాక్ వద్ద ధర్నా చేయాలని డిమాండ్ చేశారు.
ప్రజలకు ఏవీ గుర్తుండవని బీజేపీ నేతలు భావిస్తున్నట్టుంది అంటూ విమర్శించారు. మొన్నటి ఎన్నికల్లో ప్రజలు గర్వభంగం చేశారు కాబట్టి బీజేపీ నేతలకు మళ్లీ ప్రజలు గుర్తుకొచ్చిన పరిస్థితి కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. కేంద్రం రూ.2.87 లక్షల కోట్లు వసూలు చేస్తోందని, ఎక్సైజ్ సుంకం రూపంలో రూ.47 వేల కోట్లు వసూలు చేస్తోందని వివరించారు.
"కొన్నినెలలుగా వీరబాదుడు బాది ఇప్పుడు రూ.5 తగ్గిస్తారా? రూ.5, రూ.10 కాదు లీటర్ పై రూ.30 తగ్గించాలి. కేంద్ర ప్రభుత్వంతో పాటు దేశమంతా తగ్గించిందని, జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక్కటే తగ్గించలేదని ప్రచారం చేస్తున్నారు. దేశంలోని 28 రాష్ట్రాల్లో 14 రాష్ట్రాలు కేంద్రం దొంగచాటు చర్యలను గమనిస్తున్నాయి. పన్నులు విధిస్తే రాష్ట్రాలకు వాటా ఇవ్వాల్సి వస్తుందని సెస్ ల రూపంలో వసూలు చేస్తున్నారు. పన్నుల రాబడి పంపకం విధానంలో రాష్ట్రాలకు 41 శాతం ఇవ్వాలి కాబట్టి డ్రామాలు ఆడుతున్నారు. మీరు ఆడుతున్న నాటకాలను ప్రజలు గమనిస్తున్నారు.
ఇప్పుడు వీళ్లకు తోడు 40 ఇయర్స్ ఇండస్ట్రీ ఒకాయన వెనుక నుంచి ఎగదోయడానికి బయల్దేరాడు. 9వ తేదీన ధర్నాలు చేస్తాడంట! మనం అధికారంలో ఉన్నప్పుడు ఏంచేశాం అనేది ఆలోచించుకోవాలి. ధర్నాలు చేయడానికి సిగ్గుండాలి. టీడీపీ ప్రభుత్వం పెట్రోల్ పై 31 శాతం పన్నుతో పాటు సర్ చార్జి విధించింది.
బీజేపీ నేతలను ఈ సందర్భంగా అడుగుతున్నా... కేంద్రం వసూలు చేస్తున్న పన్నులు ఏమైపోతున్నాయి? ఏపీలో అమలు చేస్తున్న పథకాలు మీకు కనిపించడంలేదా? జగన్ కొనసాగిస్తున్న పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలో అయినా ఉన్నాయా? ఎంతో విశ్వసనీయతతో పాలన సాగిస్తున్న విషయం మీకు అర్థం కావడంలేదా?" అంటూ ఆగ్రహం వెలిబుచ్చారు. టీడీపీ కార్యాలయంలో ఇచ్చిన స్క్రిప్టునే బీజేపీ నేతలు చదువుతున్నారని పేర్ని నాని విమర్శించారు.