JC Prabhakar Reddy: ప్లీజ్... రాజకీయనాయకులూ మారండి: జేసీ ప్రభాకర్ రెడ్డి

JC Prabhakar Reddy questions police behavior on students

  • ఎయిడెడ్ కాలేజీలపై ప్రభుత్వం తీవ్ర నిర్ణయం
  • అనంతపురంలో విద్యార్థుల నిరసన
  • విద్యార్థులను పోలీసులు కొట్టడం దారుణమన్న జేసీ
  • దేశ భవిష్యత్తు విద్యార్థులేనని వెల్లడి

ఎయిడెడ్ కాలేజీల రద్దుపై ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలంటూ అనంతపురంలో నిరసన తెలుపుతున్న విద్యార్థులను పోలీసులు కొట్టడం దారుణమని టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. పదిహేడు, పద్దెనిమిదేళ్లున్న ఆ విద్యార్థులను పోలీసులు కొట్టడం చూస్తుంటే బాధ కలిగిందని అన్నారు.

ఈ దేశ భవిష్యత్తు విద్యార్థులేనని, అలాంటి వారి పట్ల రాజకీయ నాయకుల వైఖరి సరికాదని అభిప్రాయపడ్డారు. 'మనం రాజకీయనాయకులం వారి గురించి ఆలోచించాలి కానీ, మన గురించి మనం ఆలోచించుకుంటూ వారి భవిష్యత్తును దెబ్బతీసేలా వ్యవహరించకూడదు' అని హితవు పలికారు.

"మనం 70 ఏళ్ల ముసలోళ్లం. మనం చేసే చట్టాలు పిల్లల కోసమే అన్నట్టుండాలి కానీ ఒక్కో ప్రభుత్వం ఒక్కో నిబంధనలు తెస్తుంటే పిల్లల భవిష్యత్తు ఏంకావాలి? నేటి విద్యార్థులే రేపటి పౌరులు. ప్లీజ్... రాజకీయ నాయకులూ మారండి. విద్యార్థుల బాగోగుల కోసం చట్టాలు చేయండి... మన స్వార్థం కోసం కాదు. ఎయిడెడ్ కాలేజీలు వద్దు అనుకున్నప్పుడు వాటి స్థానంలో ఏం వస్తాయో ఆ విద్యార్థులకు అర్థమయ్యేలా చెప్పండి. ప్రతిసారి ప్రభుత్వం మారినప్పుడల్లా ఇలా చట్టాలు మారుతుంటే యువతరం పరిస్థితి ఏంటి?

అయ్యా పోలీసులూ.... విద్యార్థుల మీద కాదయ్యా మీరు దౌర్జన్యం చేసేది! మీరు కూడా ఒకప్పుడు విద్యార్థులే! ఆ విద్యార్థులు వాళ్ల బాగు కోసం వాళ్లు ఆందోళన తెలుపుతున్నారు తప్ప ఏ రాజకీయ పార్టీ కోసం కాదు. దాంట్లో మీ పిల్లలు కూడా ఉన్నారేమో... కొట్టడం మాత్రం చాలా దారుణం" అంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News