BJP: ముగిసిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం... బద్వేలు ప్రస్తావన తెచ్చిన ప్రధాని మోదీ
- సమావేశానికి హాజరైన మోదీ, నడ్డా తదితరులు
- ఏపీలో బలం పెరుగుతోందన్న మోదీ
- బద్వేలు ఉప ఎన్నికతో వెల్లడైందని వివరణ
- దుబ్బాక, హుజూరాబాద్ ఫలితాలపై నడ్డా హర్షం
ఢిల్లీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం ముగిసింది. బీజేపీ అగ్రనేతలు హాజరైన ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ సమావేశంలో తెలుగు రాష్ట్రాల గురించి మాట్లాడారు.
బద్వేలు ఉప ఎన్నిక ద్వారా ఏపీలో బీజేపీకి బలం పెరిగిందన్న అంశం నిరూపితమైందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. జేపీ నడ్డా స్పందిస్తూ... మొన్న దుబ్బాక, నిన్న హుజూరాబాద్ లో బీజేపీ విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ బీజేపీ నేతలకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి క్రమంగా బీజేపీకి అనుకూలంగా మారుతోందని మోదీ, నడ్డా అభిప్రాయపడ్డారు.
కాగా, దేశంలో కరోనా వ్యాక్సినేషన్ 100 కోట్ల మార్కు అధిగమించిన నేపథ్యంలో బీజేపీ అగ్రనేతలు ప్రధాని మోదీని గజమాలతో సత్కరించారు.