Akhilesh Yadav: పాకిస్థాన్ జాతిపిత మహమ్మద్ అలీ జిన్నాను పొగడ్తలతో ముంచెత్తిన అఖిలేశ్ యాదవ్
- బహిరంగ సభలో మాట్లాడుతూ వ్యాఖ్యలు
- సర్దార్ పటేల్, గాంధీ, జిన్నా ఒకే చోట చదువుకుని న్యాయవాదులు అయ్యారన్న మాజీ సీఎం
- జిన్నా చరిత్ర తెలుసుకోవాలన్న బీజేపీ
పాకిస్థాన్ జాతిపిత మహమ్మద్అలీ జిన్నాపై ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పీ) చీఫ్ అఖిలేశ్ యాదవ్ ప్రశంసల వర్షం కురిపించారు. ఆయనను స్వాతంత్ర్య సమరయోధుడిగా కీర్తించారు. వచ్చే ఏడాది రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నిన్న హర్దోయ్‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో మాట్లాడారు. సర్దార్ వల్లభాయ్ పటేల్, మహాత్మాగాంధీ, జిన్నా ఒకే సంస్థలో చదివి న్యాయవాదులు అయ్యారన్నారు. వీరందరూ భారత స్వాత్రంత్య పోరాటంలో కీలకంగా వ్యవహరించారని కొనియాడారు.
నాడు రైతుల కోసం పోరాడిన పటేల్‌కు సర్దార్ అనే బిరుదు వచ్చిందని, ఆయన బాటలోనే పయనిస్తున్నామని చెప్పుకుంటున్న బీజేపీ మాత్రం నేడు రైతులను ఏడిపిస్తోందని అఖిలేశ్ దుయ్యబట్టారు. కాగా, జిన్నాను స్వాతంత్ర్య సమరయోధుడిగా అఖిలేశ్ పేర్కొనడంపై పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. బీజేపీ ఎంపీ బ్రిజ్‌లాల్ అఖిలేశ్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జిన్నా చరిత్రను ఒకసారి తెలుసుకోవాలని సూచించారు. హిందువులపై సామూహిక హత్యాకాండను జిన్నా ప్రోత్సహించారని, దేశ విభజనకు కారణమైన వ్యక్తిని ప్రశంసించడం మానుకోవాలని హితవు పలికారు.