Tollywood: సినీ నటుడు నాగశౌర్య విల్లాపై పోలీసుల దాడులు.. పేకాట ఆడుతున్న పలువురి అరెస్ట్

Naga Shauryas farm house raided by SOT police
  • హైదరాబాద్ శివారులోని మంచిరేవుల వద్ద నాగశౌర్య విల్లా
  • బర్త్ డే పార్టీ కోసం అద్దెకు తీసుకుని పేకాట స్థావరంగా మార్చిన వైనం
  • 25 మంది అరెస్ట్.. రూ. 6.7 లక్షల నగదు స్వాధీనం
టాలీవుడ్ యువనటుడు నాగశౌర్య విల్లాపై దాడిచేసిన పోలీసులు పేకాట ఆడుతున్న పలువురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి పెద్దమొత్తంలో నగదు, సెల్‌ఫోన్లు, కార్లు స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ పరిధిలోని మంచిరేవుల వద్దనున్న నాగశౌర్య విల్లాపై దాడి చేశారు. సుమన్ అనే వ్యక్తి బర్త్ డే ఫంక్షన్ కోసం ఈ విల్లాను అద్దెకు తీసుకుని దానిని పేకాట స్థావరంగా మార్చినట్టు తెలుస్తోంది.

మొత్తంగా 25 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి రూ. 6.7 లక్షల నగదు, 33 సెల్‌ఫోన్లు, 24 కార్లు, 2 క్యాసినో డబ్బాలు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు సుమన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆరు నెలల క్రితం ఈ విల్లాను నాగశౌర్య అద్దెకు తీసుకున్నారు.

కాగా, ఫామ్‌హౌస్‌ను పేకాట స్థావరంగా మార్చిన విషయం నాగశౌర్యకు తెలుసా? అన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలావుంచితే, పోలీసుల రాకను గుర్తించిన కొందరు తప్పించుకునేందుకు మద్యం సీసాలను వారిపైకి విసిరినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.



Tollywood
Naga Shaurya
Hyderabad
Playing Cards Game

More Telugu News