Hyderabad: డ్రగ్స్ తనిఖీల సమయంలో సాధారణ పౌరుల వాట్సప్ చాట్‌లపై నిఘా.. హైదరాబాద్ సీపీకి నోటీసులు
- హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున డ్రగ్స్, గంజాయి కోసం తనిఖీలు
- పౌరుల వాట్సప్ చాటింగ్ లు చూస్తోన్న పోలీసులు
- హక్కులకు భంగం కలిగించడమేనని నోటీసులు
- నోటీసులు పంపిన డేటా, ప్రైవసీ పరిశోధకుడు కె.శ్రీనివాస్
హైదరాబాద్‌లో డ్రగ్స్, గంజాయి వంటివి లేకుండా చేసేందుకు పోలీసులు పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పౌరుల వాట్సప్ చాట్‌లను కూడా పోలీసులు పరిశీలిస్తుండడం చర్చనీయాంశంగా మారింది. ఇది పౌరుల వ్యక్తిగత గోప్యత హక్కుకు భంగం కలిగించడమేనని అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
పోలీసులు పౌరుల వాట్సప్ చాట్‌పై నిఘా పెట్టడం పట్ల డేటా, ప్రైవసీ పరిశోధకుడు కె.శ్రీనివాస్ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్‌కు లీగల్ నోటీసులు పంపారు. పోలీసుల తీరు నిబంధనలకు విరుద్ధమని తెలిపారు. వెస్ట్‌జోన్ ప్రాంతంలో డ్రగ్స్ సంబంధిత తనిఖీల సమయంలో స్మార్ట్‌ఫోన్లు చూపించాలని పోలీసు అధికారులు పౌరులను కోరిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వస్తున్నాయి.
వాటి ఆధారంగానే సీపీకి శ్రీనివాస్ నోటీసులు పంపారు. ఈ నెల 27న హైదరాబాద్‌లోని మంగళ్‌హాట్, ధూల్‌పేట్, జుమేరాత్‌బజార్ ప్రాంతాల్లో వాట్సాప్ చాట్‌లు తనిఖీ చేయడాన్ని ఆయన గుర్తు చేశారు. పౌరులను ఇలా రోడ్లపై నిలిపి, వారి మొబైల్ ఫోన్లను చూపించాలని ఆదేశించడానికి పోలీసులకు అధికారాలు లేవని అన్నారు.