South Africa: టీ20 వరల్డ్ కప్: శ్రీలంకపై దక్షిణాఫ్రికా థ్రిల్లింగ్ విక్టరీ... హసరంగ హ్యాట్రిక్ వృథా
- షార్జాలో జరిగిన మ్యాచ్
- తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక
- 20 ఓవర్లలో 142 ఆలౌట్
- 19.5 ఓవర్లలో ఛేదించిన దక్షిణాఫ్రికా
ఆసక్తికరంగా సాగుతున్న ఐసీసీ టీ20 వరల్డ్ కప్ లో మరో ఉత్కంఠ పోరు జరిగింది. గ్రూప్-1లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో దక్షిణాఫ్రికా అద్భుత విజయం సాధించింది. ఓ దశలో స్పిన్నర్ హసరంగ హ్యాట్రిక్ తో విజృంభించడంతో ఓటమి బాటలో నిలిచిన దక్షిణాఫ్రికా... డేవిడ్ మిల్లర్ విజృంభణతో మరో బంతి మిగిలుండగానే గెలిచింది.
మిల్లర్ 13 బంతుల్లో 2 సిక్సర్లతో 23 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అటు, కగిసో రబాడా సైతం ధాటిగా ఆడడంతో దక్షిణాఫ్రికా విజయం ఖరారైంది. రబాడా 7 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్ తో 13 పరుగులు చేశాడు. గెలుపునకు ఒక్క పరుగు కావాల్సి ఉండగా, లహిరు కుమార వేసిన బంతిని రబాడా ఫోర్ కొట్టి మ్యాచ్ ముగించాడు.
దక్షిణాఫ్రికా ఛేజింగ్ లో నిలబడింది అంటే కెప్టెన్ టెంబా బవుమా ఇన్నింగ్సే కారణం. బవుమా 46 బంతుల్లో 46 పరుగులు చేశాడు. లంక బౌలర్లలో వనిందు హసరంగ 3, దుష్మంత చమీర 2 వికెట్లు తీశారు. ఈ ఓటమితో నాకౌట్ అవకాశాలను సఫారీలు మెరుగుపర్చుకోగా, శ్రీలంక పరిస్థితి ఇబ్బందికరంగా మారింది.
ఆస్ట్రేలియాపై టాస్ నెగ్గిన ఇంగ్లండ్
గ్రూప్-1లో నేడు మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. అగ్రశ్రేణి జట్లు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ దుబాయ్ వేదికగా అమీతుమీకి సిద్ధమయ్యాయి. టాస్ గెలిచిన ఇంగ్లండ్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ టోర్నీలో ఈ రెండు జట్లు ఇప్పటివరకు ఓటమి లేకుండా ప్రస్థానం కొనసాగిస్తున్నాయి. తాము ఆడిన రెండు మ్యాచ్ ల్లోనూ నెగ్గి పాయింట్ల పట్టికలో పైన నిలిచాయి.