Bollywood: రాత్రంతా క్షణాలను యుగాల్లా గడిపిన షారూఖ్.. ఉదయాన్నే ఆర్థర్ రోడ్ జైలుకు పరుగులు!
- డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన ఆర్యన్ ఖాన్
- దాదాపు నెల రోజులపాటు జైలులోనే
- బెయిలు కోసం లక్ష రూపాయల పూచీకత్తు సమర్పించిన జుహీచావ్లా
- ఆర్యన్ విడుదలకు ఏర్పాట్లు ప్రారంభించిన జైలు అధికారులు
డ్రగ్స్ కేసులో చిక్కుకున్న బాలీవుడ్ ప్రముఖ నటుడు షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ మరికాసేపట్లో ఆర్ధర్ రోడ్ జైలు నుంచి విడుదల కాబోతున్నాడు. దాదాపు నెల రోజులపాటు జైలులో ఉన్న 23 ఏళ్ల ఆర్యన్ ఖాన్‌కు గురువారం బాంబే హైకోర్టు బెయిలు మంజూరు చేసింది. అయితే, నిన్న సాయంత్రం ఐదున్నర గంటల వరకు బెయిలు పేపర్లు జైలుకు అందకపోవడంతో బెయిలు మంజూరైనప్పటికీ నిన్న జైలులోనే గడపాల్సి వచ్చింది. నాలుగు వారాల పాటు దూరమైన కుమారుడు ఇంటికి రాబోతున్నాడన్న ఆనందంతో రాతంత్రా క్షణమొక యుగంలా గడిపిన షారూఖ్ ఖాన్ ఉదయాన్నే ఆర్థర్ రోడ్డు జైలుకు బయలుదేరాడు.
బెయిలు పేపర్లు సమర్పించేందుకు రోజులో నాలుగుసార్లు ఉదయం 5.30, 10.30, మధ్యాహ్నం 3.30, సాయంత్రం 5.30 గంటలకు ‘బెయిలు బాక్స్’ను తెరుస్తారు. ఆర్యన్‌ఖాన్‌కు బెయిలు మంజూరైన తర్వాత ఆర్యన్ ఖాన్ లాయర్ పత్రాలు పట్టుకుని వెంటనే ఆర్ధర్ రోడ్డు జైలుకు బయలుదేరారు. అయితే, సాయంత్రం 5.30 గంటల గడువును త్రుటిలో తప్పిపోయారు. దీంతో ఆర్యన్ గత రాత్రి కూడా జైలులోనే గడపాల్సి వచ్చింది.
ఉదయాన్నే బెయిలు బాక్సును తెరిచిన జైలు అధికారులు ఆర్యన్ విడుదలకు అవసరమైన ప్రక్రియను ప్రారంభించారు. ఆర్యన్ ఖాన్ కోసం సీనియర్ న్యాయవాది, భారత మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. షారూఖ్‌తో గతంలో కలిసి నటించిన జుహీ చావ్లా.. ఆర్యన్‌ఖాన్ కోసం లక్ష రూపాయల వ్యక్తిగత పూచీకత్తు సమర్పించారు. కాగా, క్రూయిజ్ డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసులో ఇప్పటి వరకు 20 మందిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అరెస్ట్ చేసింది.