Etela Rajender: ఓటు హక్కును వినియోగించుకున్న ఈటల.. టీఆర్ఎస్ పార్టీపై ఫైర్!

Etela Rajender casts his vote

  • ఒక ఎన్నిక కోసం వందల కోట్లు ఖర్చు చేశారు
  • పోలీసులు ఎస్కార్ట్ ఇచ్చి డబ్బు, మద్యాన్ని తరలించారు
  • ప్రజలు తమ బాధను ఓట్ల రూపంలో వ్యక్తపరుస్తున్నారు 

హుజూరాబాద్ ఉపఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ తన భార్య జమునతో కలిసి కమలాపూర్ లోని 262 నెంబర్ పోలింగ్ బూత్ లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ సరళిని గమనించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ అధికార టీఆర్ఎస్ పార్టీపై నిప్పులు చెరిగారు. ఒక ఎన్నిక కోసం ఇన్ని వందల కోట్లను ఖర్చు చేయడం దేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఎప్పుడూ జరగలేదని అన్నారు. ప్రభుత్వ జీవోల ద్వారా వేల కోట్ల రూపాయల ప్రలోభాలకు గురి చేశారని చెప్పారు.

హుజూరాబాద్ లో ఏం జరుగుతోందనే విషయాన్ని యావత్ తెలంగాణ ఉత్కంఠగా ఎదురు చూసిందని ఈటల అన్నారు. తమ గుండెల్లోని బాధను హుజూరాబాద్ ప్రజలు ఓట్ల రూపంలో వ్యక్తపరుస్తున్నారని తెలిపారు. పోలింగ్ ప్రారంభమైన వెంటనే పెద్ద సంఖ్యలో ఓటర్లు పోలింగ్ బూత్ లకు తరలి వచ్చారని... 90 శాతానికి పైగా ఓటింగ్ నమోదవుతుందని చెప్పారు. పోలీసులు ఏకపక్షంగా టీఆర్ఎస్ పార్టీకి సహకరించారని మండిపడ్డారు. పోలీసులే ఎస్కార్ట్ ఇచ్చి డబ్బును, మద్యాన్ని తరలించారని అన్నారు. హుజూరాబాద్ పోలీసుల తీరు ప్రజాస్వామ్యానికే మచ్చ అని విమర్శించారు.

టీఆర్ఎస్ నేతలు ఓటర్లను భయభ్రాంతులకు గురి చేశారని ఈటల అన్నారు. ఆ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపించారు. అయితే, ధర్మం విజయం సాధిస్తుందని ఓటర్లు చెపుతున్నారని చెప్పారు. ప్రజలు స్వచ్ఛందంగా, ధర్మంగా నిజాయతీని నిరూపించుకోవాలని అన్నారు. ఈటల భార్య జమున మాట్లాడుతూ హుజూరాబాద్ లో ధర్మమే గెలుస్తుందని చెప్పారు. మరోవైపు ఉదయం 9 గంటల సమయానికి 10.5 శాతం ఓటింగ్ నమోదయింది. హైదరాబాద్ లోని బుద్ధభవన్ నుంచి రాష్ట్ర ఎన్నికల అధికారి పోలింగ్ సరళిని గమనిస్తున్నారు.

  • Loading...

More Telugu News