Kodali Nani: మంత్రి కొడాలి నాని హామీతో ఆందోళన విరమించిన రేషన్ డీలర్లు
- 2020 పీఎంజీకేవై కమీషన్ బకాయిలను వెంటనే చెల్లించాలని రేషన్ డీలర్ల డిమాండ్
- గోనె సంచులు తిరిగిస్తే రూ. 20 చెల్లించాలని విన్నపం
- అన్ని డిమాండ్లను నెరవేరుస్తామని హామీ ఇచ్చిన కొడాలి నాని
ఏపీలోని రేషన్ డీలర్లు తమ ఆందోళనను తాత్కాలికంగా విరమించారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా రేషన్ డీలర్లు బంద్ చేపట్టిన సంగతి తెలిసిందే. 2020 పీఎంజీకేవై కమీషన్ బకాయిలను వెంటనే చెల్లించాలని, ధరల వ్యత్యాస సర్క్యులర్ ను అమలు చేయాలని, డీడీ నగదు వాపసు చేయాలని డీలర్లు డిమాండ్ చేస్తున్నారు. దీనికి తోడు ప్రభుత్వానికి గోనె సంచులను తిరిగిస్తే రూ. 20 చెల్లించాలనే జీవోను అమలు చేయాల్సిందేనని కోరుతున్నారు.
ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రి కొడాలి నాని రేషన్ డీలర్లతో చర్చలు జరిపారు. సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని డీలర్లకు మంత్రి హామీ ఇచ్చారు. నవంబర్ నెలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రేషన్ కోటాను సరఫరా చేస్తామని చెప్పారు. దీంతో డీలర్లు తమ ఆందోళనను విరమించారు.