Goat: మేక పాలతో డెంగ్యూ తగ్గుతుందంటూ ప్రచారం.. లీటర్ కు రూ.400 పెట్టినా దొరకని వైనం!
- రూ.30 నుంచి అమాంతం పెరిగిపోయిన ధర
- ప్లేట్ లెట్స్ పెరుగుతాయన్న గవర్నమెంట్ డాక్టర్
- మేకపాల కోసం ఎగబడుతున్న జనం
- మధ్యప్రదేశ్ లోని ఛత్తర్ పూర్ లో ఘటన
మామూలుగా లీటర్ మేక పాలు రూ.30కే దొరికేస్తాయి. కానీ, మధ్యప్రదేశ్ లోని ఛత్తర్ పూర్ లో ఇప్పుడు రూ.400 పెట్టినాగానీ దొరకట్లేదు. అవును, డెంగ్యూ వచ్చిన పేషెంట్లలో ప్లేట్ లెట్లు అమాంతం పడిపోతుంటాయి. ఆ రక్తకణాలు పడిపోకుండా, మెరుగైన సంఖ్యలో ఉంచేందుకు మేక పాలు దోహదపడతాయని ఛత్తర్ పూర్ ప్రభుత్వాసుపత్రి వైద్యుడు చెప్పడంతో.. జనాలు మేకపాల కోసం ఎగబడుతున్నారు.
అనుకోకుండా పెరిగిన ఈ డిమాండ్ తో వ్యాపారులూ ధరలు బాగా పెంచేశారు. డెంగ్యూ వచ్చిన రోగులు మేక పాలు తాగితే మంచిదేగానీ.. అదే డెంగ్యూను పూర్తిగా తగ్గిస్తుందనుకోవడం మాత్రం పొరపాటని, మేకపాలు మంచివని చెప్పిన డాక్టర్ అభయ్ సింగ్ తెలిపారు. ప్రస్తుతం ఛత్తర్ పూర్ లో డెంగ్యూ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. జిల్లా ప్రభుత్వాసుపత్రిలోనే 20 దాకా కేసులున్నాయి. ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ జనం చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే జనాలు మేకపాలపై దృష్టి పెడుతున్నారు.