Gold: యాదాద్రి గోపురానికి స్వర్ణ తాపడం... కేసీఆర్ పిలుపుతో భారీగా పసిడి విరాళాలు
- ప్రతిష్ఠాత్మకంగా యాదాద్రి క్షేత్ర పునర్నిర్మాణం
- విమాన గోపురానికి స్వర్ణతాపడం
- పసిడి విరాళాల కోసం పిలుపునిచ్చిన కేసీఆర్
- విరాళం ప్రకటించిన దానం నాగేందర్, చిన్నపరెడ్డి
- 3 కిలోల బంగారం అందిస్తున్నట్టు బ్రాహ్మణ సంస్థాన్ ప్రకటన
తెలంగాణలో అత్యంత ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం. టీఆర్ఎస్ సర్కారు ఈ ఆలయ పునర్నిర్మాణ పనులను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ క్రమంలో స్వామివారి ఆలయ విమాన గోపురానికి స్వర్ణ తాపడం చేయించాలని నిర్ణయించారు. అందుకోసం పెద్ద ఎత్తున బంగారం అవసరం కావడంతో సీఎం కేసీఆర్ విరాళాలకు పిలుపునిచ్చారు. కేసీఆర్ పిలుపునకు భారీ స్పందన వస్తోంది. ఇప్పటివరకు 36.16 కిలోల బంగారం విరాళాల రూపంలో అందినట్టు సీఎంవో వెల్లడించింది.
ఎమ్మెల్యే దానం నాగేందర్ కేజీ బంగారం విరాళంగా ప్రకటించగా... ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి శ్రీని ఫార్మా సంస్థతో కలిసి కేజీ బంగారం విరాళంగా అందించనున్నట్టు తెలిపారు. ఇక, ఏపీ, తెలంగాణ బ్రాహ్మణుల తరఫున 3 కిలోల బంగారం అందించనున్నట్టు భారత బ్రాహ్మణ సంస్థాన్, బ్రాహ్మణ సంక్షేమ భవన్ వ్యవస్థాపక అధ్యక్షుడు గిరిప్రసాద్ శర్మ వెల్లడించారు. కొందరు ఇతర దాతలు కూడా యాదాద్రి క్షేత్ర విమాన గోపుర స్వర్ణతాపడానికి తమవంతు విరాళాలు ప్రకటించినట్టు సీఎంవో అధికారులు తెలిపారు.