Vijayawada: దసరాలో ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు.. రికార్డు స్థాయిలో ఆదాయం
- నవరాత్రుల్లో దుర్గమ్మను దర్శించుకున్న 5.75 లక్షల మంది
- లడ్డూల విక్రయం ద్వారా రూ. 1.58 కోట్ల ఆదాయం
- గతేడాదితో పోలిస్తే రెట్టింపు ఆదాయం
బెజవాడ దుర్గమ్మ దసరా ఆదాయం ఈసారి అదిరిపోయింది. కనకదుర్గను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఫలితంగా గతేడాది కంటే రెట్టింపు ఆదాయం వచ్చింది. నవరాత్రుల్లో మొత్తంగా రూ. 4.08 కోట్ల ఆదాయం వచ్చినట్టు ఆలయ అధికారులు తెలిపారు. రికార్డు స్థాయిలో 15.79 లక్షల లడ్డూలను భక్తులు కొనుగోలు చేశారు. ఫలితంగా రూ. 1.58 కోట్ల ఆదాయం సమకూరింది. కరోనా కారణంగా గతేడాది పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించడంతో రూ. 2.7 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది. అంతకుముందు ఏడాది రూ. 5 కోట్ల ఆదాయం వచ్చింది.
ఈసారి అమ్మను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. నవరాత్రుల్లో ఏకంగా 5.75 లక్షల మంది దుర్గమ్మను దర్శించుకున్నారు. నిజానికి రోజుకు 10 వేల మందినే అనుమతించాలని ఆలయ అధికారులు భావించినప్పటికీ సాధ్యం కాలేదు. కొవిడ్ ప్రభావం కొంత నెమ్మదించడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో చేసేది లేక అధికారులు వారిని అనుమతించాల్సి వచ్చింది.
నవరాత్రుల్లో దుర్గ గుడికి వచ్చిన ఆదాయ వివరాలను పరిశీలిస్తే.. ప్రసాదాల రూపంలో రూ. 1.58 కోట్లు, రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్లపై రూ.79.50 లక్షలు, రూ. 100 టికెట్లపై రూ. 64.68 లక్షలు, ప్రత్యేక పూజల ద్వారా రూ. 68.55 లక్షలు, చీరల విక్రయం ద్వారా రూ. 11.37 లక్షలు, కేశఖండనాల ద్వారా రూ. 12.02 లక్షల ఆదాయం సమకూరింది.