Kerala: కేరళలో కుంభవృష్టి... ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్
- కేరళలో ఈ ఉదయం నుంచి భారీ వర్షాలు
- సాయంత్రానికి మరింత పెరగనున్న వర్ష తీవ్రత
- ఐఎండీ హెచ్చరిక.. ఉప్పొంగుతున్న నదులు
కేరళను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఈ ఉదయం నుంచి కుండపోత వానలు కురుస్తుండడంతో కేరళ దక్షిణాది జిల్లాల్లో నదులు ఉప్పొంగుతున్నాయి. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఈ సాయంత్రానికి ఉత్తరాది జిల్లాల్లో వర్ష తీవ్రత మరింత పెరుగుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) పేర్కొంది. ఈ మేరకు ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. కూటిక్కల్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడగా, 12 మంది గల్లంతయ్యారు.
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కేరళలోని డ్యామ్ లు పరవళ్లు తొక్కుతున్నాయి. ఇడుక్కి జిల్లాలోని మలంకర డ్యామ్ కు వరద పోటెత్తడంతో గేట్లు ఎత్తేందుకు కలెక్టర్ అనుమతి మంజూరు చేశారు. అటు, ఎర్నాకుళం జిల్లాలో మువట్టుపుళ నది ఉగ్రరూపం దాల్చింది. నదీ పరీవాహక ప్రాంతాల్లోని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని అధికారులు స్పష్టం చేశారు. గతంలో వరద అనుభవాలు దృష్టిలో ఉంచుకుని ప్రజలు హడలిపోతున్నారు.
కాగా, రాష్ట్రంలో భారీ వర్షాలపై సీఎం పినరయి విజయన్ ఈ మధ్యాహ్నం 3 గంటలకు సమీక్ష చేపట్టనున్నారు.