Afghanistan: సుప్రీంకోర్టు చెప్పేదాకా బహిరంగ మరణ శిక్షలు వుండవు: తాలిబన్ల ప్రకటన
- నరికివేతలు, ఉరితీతలు వద్దన్న జబీహుల్లా ముజాహిద్
- కోర్టు ఉత్తర్వులుంటేనే అమలు చేస్తామని వెల్లడి
- మంత్రి మండలి ఆమోదం తెలిపిందని వ్యాఖ్య
తాలిబన్ల చేతుల్లోకి ఆఫ్ఘనిస్థాన్ వెళ్లిపోయాక అరాచకాలు బాగా పెరిగిపోయాయి. జనానికి బహిరంగ శిక్షలు వేస్తూ తాలిబన్లు తెగబడుతున్నారు. అయితే, తాజాగా బహిరంగ మరణ శిక్షలపై తాలిబన్లు ప్రకటన చేశారు. దేశ సుప్రీంకోర్టు ఆదేశాలు వచ్చే వరకు బహిరంగ శిక్షలను అమలు చేయబోమని తెలిపారు.
సుప్రీంకోర్టు నుంచి ఉత్తర్వులు వస్తేనే బహిరంగ మరణ శిక్షలు, మృతదేహాలను బహిరంగంగా వేలాడదీయడం అమలు చేయాలని తాలిబన్ల ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ చెప్పారు. అందుకు మంత్రి మండలి మొత్తం ఆమోదం తెలిపిందన్నారు. శిక్ష విధిస్తే తప్పనిసరిగా అతడు చేసిన నేరమేంటో ప్రజలకు తెలిసేలా చేయాలని చెప్పారు.
అయితే, కాళ్లూచేతుల నరికివేత, ఉరితీత వంటి కఠినమైన శిక్షలను బహిరంగంగా అమలు చేస్తామని గతంలో ఆఫ్ఘనిస్థాన్ న్యాయ శాఖ మంత్రి ముల్లా నూరుద్దీన్ తురాబీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అమెరికా దానిపై ఆందోళన వ్యక్తం చేసినా.. తాము ఎలాంటి శిక్షలు వేయాలో వేరే దేశాలు చెప్పాల్సిన పని లేదంటూ నూరుద్దీన్ అన్నారు.