BCCI: ఐపీఎల్ లో కొత్త జట్ల కోసం టెండర్లను పొడిగించిన బీసీసీఐ
- ప్రస్తుతం ఐపీఎల్ లో 8 జట్లు
- మరో రెండు జట్లకు అవకాశం కల్పిస్తున్న బీసీసీఐ
- 2022 సీజన్ లో 10 జట్లతో ఐపీఎల్
- గతంలో టెండర్లకు ఆహ్వానం
- తాజాగా అక్టోబరు 20 వరకు పొడిగింపు
వచ్చే సీజన్ నుంచి ఐపీఎల్ లో 10 జట్లు పోటీపడనున్నాయి. ఇప్పుడున్న 8 జట్లకు అదనంగా మరో రెండు జట్లకు బీసీసీఐ అవకాశం ఇవ్వనుంది. ఈ మేరకు కొత్త జట్ల కోసం గతంలో టెండర్లు పిలవగా, ఆ గడువు ఈ నెల 10తో ముగిసింది.
ఈ నేపథ్యంలో, మరో 10 రోజుల పాటు టెండర్లను పొడిగిస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది. టెండర్ డాక్యుమెంట్ల కొనుగోలుకు అక్టోబరు 20 వరకు అవకాశం ఇచ్చింది. టెండర్ ఫీజు కింద రూ.10 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఫీజు తిరిగి చెల్లించబడదని బోర్డు గతంలోనే పేర్కొంది.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... కొత్త జట్లలో ఒక్కొక్క దాని విలువ కనీసం రూ.3,500 కోట్లు, ఆపైన ఉంటేనే ఆయా టెండర్లకు బోర్డు ఆమోదం తెలిపే అవకాశాలు ఉన్నాయి. కొత్తగా ఎంపిక చేసే ఫ్రాంచైజీలు అహ్మదాబాద్, లక్నో లేక పూణే నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తాయని తెలుస్తోంది.