Odisha: మల్కనగిరి జిల్లాలో ఎదురుకాల్పులు.. ముగ్గురు మావోయిస్టుల హతం
- తులసిదళం సభ్యులు సమావేశమైనట్టు సమాచారం
- సోమవారం రాత్రి నుంచి గాలింపు
- నిన్న ఒకరికొకరు తారసపడిన వైనం
- రెండు గంటలపాటు భీకర ఎన్‌కౌంటర్
- మృతుల్లో ఇద్దరు మహిళలు
ఒడిశాలోని మల్కనగిరి జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. జిల్లాలోని మథిలి పోలీసు స్టేషన్ పరిధిలోని తులసిపహాడ్ సమీపంలోని కెరిమట్టి అటవీ ప్రాంతంలో ఈ ఎదురుకాల్పులు జరిగాయి.
ఇక్కడ తులసిదళం సభ్యులు సమావేశమైనట్టు సమాచారం అందుకున్న పోలీసులు.. ఎస్పీ ప్రహ్లాద్ సహాయ మీనా నేతృత్వంలోని పోలీసు బృందం సోమవారం రాత్రి నుంచి గాలింపు చేపట్టారు. నిన్న ఉదయం పోలీసులను గమనించిన మవోయిస్టులు కాల్పులు ప్రారంభించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఎదురుకాల్పులు ప్రారంభించారు. రెండు గంటలపాటు ఇరువర్గాల మధ్య హోరాహోరీగా కాల్పులు జరిగాయి.
కాల్పులు ఆగిపోయిన తర్వాత ఘటనా స్థలంలో పరిశీలించగా ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలు కనిపించినట్టు డీజీపీ అభయ్ తెలిపారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నట్టు చెప్పారు. మావోయిస్టు కీలకనేత సునీల్, మరికొందరు అక్కడి నుంచి పరారయ్యారని పేర్కొన్నారు. ఘటనా స్థలం నుంచి ఒక ఇన్‌సాస్, ఒక ఎస్ఎల్ఆర్ రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నారు.