ICAR: ఒకే మొక్కకు కాసిన వంకాయ, టమాటా.. వ్యవసాయ పరిశోధన మండలి అద్భుతం
- మొక్కను అభివృద్ధి చేసిన వారణాసి కూరగాయల పరిశోధన సంస్థ
- కాశీ సందేశ్ రకం వంకాయతో, కాశీ అమన్ టమాటాతో అంటు
- 60-70 రోజుల తర్వాత కాపు
ఢిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్) సారథ్యంలో వారణాసి కూరగాయల పరిశోధన సంస్థ అద్భుతం చేసింది. ఒకే మొక్కకు వంకాయ, టమాటాలను పండించి చూపించింది. సంకరజాతి వంకాయ రకం కాశీ సందేశ్ను, టమాటా రకం కాశీ అమన్తో అంటుకట్టడం ద్వారా ఒకే మొక్కకు ఒకేసారి టమాట, వంకాయలు కాసే కొత్త విధానాన్ని అభివృద్ధి చేసింది.
ఈ కొత్త మొక్కను 15 రోజుల నుంచి 18 రోజుల తర్వాత భూమిలో నాటి పరీక్షించారు. తొలి దశలో వంకాయ, టమాటా కొమ్మలు ఒకేలా పెరిగేలా చూసుకున్నారు. సేంద్రియ ఎరువుతోపాటు రసాయన ఎరువులు వాడారు. ఇలా పెంచిన అంటు మొక్కకు 60-70 రోజుల తర్వాత వంకాయలు, టమాటాలు కాయడం మొదలైంది. ప్రయోగాత్మక దశలో ఒక్కో మొక్కకు సగటున 2.383 కిలోల టమాటాలు, 2.684 కిలోల వంకాయలు కాసినట్టు శాస్త్రవేత్తలు తెలిపారు.