Taliban: ఆఫ్ఘనిస్థాన్ తో ముగియలేదు... పాకిస్థాన్ పై కన్నేసిన తాలిబన్లు!
- ఆఫ్ఘన్ నుంచి వైదొలగిన అమెరికా సేనలు
- అమెరికా సైన్యం వెళ్లిపోయేలోపే ఆఫ్ఘన్ ను ఆక్రమించిన తాలిబన్లు
- ఇస్లామిక్ షరియా అమలే ప్రధాన అజెండా
- షరియా విస్తరణపై తాలిబన్ల దృష్టి
అమెరికా దళాల ఉపసంహరణ ప్రకటన చేసిన కొన్ని వారాల్లోనే ఆఫ్ఘనిస్థాన్ ను ఆక్రమించిన తాలిబన్లు యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేశారు. ఈ దురాక్రమణలో తాలిబన్లకు సహకరించింది పాకిస్థాన్ అన్న సంగతి తెలిసిందే. ఆఫ్ఘన్ లో తాలిబన్లు పీఠం ఎక్కితే అది పాకిస్థాన్ కే లాభిస్తుందని అందరూ భావించారు. కానీ వాస్తవ పరిస్థితి మరోలా ఉంది. చాలామంది తాలిబన్ యోధుల దృష్టి ఇప్పుడు పాకిస్థాన్ పై పడింది. తమ తదుపరి లక్ష్యం పాకిస్థానే అని వారు భావిస్తున్నారు.
ఇస్లామిక్ షరియా చట్టం అమలు చేయాలన్నది తాలిబన్ల ప్రధాన, ఏకైక అజెండా. ఆఫ్ఘనిస్థాన్ ను చేజిక్కించుకోవడంతో తమ లక్ష్యం ముగియలేదని, షరియాను మరింతగా విస్తరించాలన్న ఆలోచనలో తాలిబన్లు ఉన్నట్టు వెల్లడైంది. తమ పోరాటం ఆఫ్ఘన్ తో ముగియలేదని, అది ప్రారంభం మాత్రమేనని తాలిబన్ నేతల మనోభావాలు ప్రతిబింబిస్తున్నాయి. షరియా విస్తరణను ఆఫ్ఘన్ వెలుపల పాకిస్థాన్ నుంచే మొదలుపెట్టాలని తాలిబన్ ఫైటర్లు కోరుకుంటున్నారు. తాలిబన్ల తాజా ప్రణాళికే నిజమైతే, పాముకు పాలుపోస్తే ఏంజరుగుతుందన్నది పాకిస్తాన్ కు తప్పక అనుభవంలోకి వస్తుంది.