Andhra Pradesh: వరదలు వస్తున్నా ఆగని పోలవరం జలవిద్యుత్ కేంద్రం పనులు
- 12 సొరంగాలను తవ్వుతున్న మేఘా సంస్థ
- ఇప్పటికే రెండు సొరంగాలు పూర్తి
- అతి తక్కువ టైంలో రెండో సొరంగం తవ్వకం
- శరవేగంగా సాగుతున్న ప్రాజెక్ట్ పనులు
పోలవరం జలవిద్యుత్ ప్రాజెక్టు పనులను ఏపీ సర్కార్ వేగంగా చేస్తోంది. ఇటీవలి వర్షాలకు భారీ వరదలు వస్తున్నా పనులను ఆపలేదు. ఇటీవలే ప్రారంభించిన జలవిద్యుత్ కేంద్రం ప్రెజర్ టన్నెల్ పనులను ప్రస్తుతం చేస్తున్నారు. ఆ పనులు దాదాపు పూర్తి కావస్తున్నాయి. జలవిద్యుత్ కేంద్రంలో మొత్తంగా 12 సొరంగాలను తవ్వుతున్నారు. ఒక్కోదాని పొడవు 150.3 మీటర్లు కాగా.. వెడల్పు 9 మీటర్లు.
టన్నెల్ పనులను మేఘా ఇంజనీరింగ్ సంస్థ నిర్వహిస్తోంది. ఇప్పటికే మొదటి టన్నెల్ పనులు పూర్తయ్యాయి. రెండో సొరంగం పనులను అతి తక్కువ టైంలోనే సంస్థ పూర్తి చేసింది. మిగతా టన్నెల్ పనులు సాగుతున్నాయి. ఇప్పటికే 21,39,639 క్యూబిక్ మీటర్ల మేర మట్టిని తవ్వింది. మొత్తం 12 వర్టికల్ కల్పన్ టర్బైన్లను ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కోదాని సామర్థ్యం 80 మెగావాట్లు.
ఒక్కో ప్రెజర్ టన్నెల్ కు ఒక జనరేటర్ ట్రాన్స్ ఫార్మర్ ను ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో ట్రాన్స్ ఫార్మర్ సామర్థ్యం 100 మెగావాట్లు అని అధికారులు చెబుతున్నారు. సొరంగాల తవ్వకం పనులను జెన్కో ఎస్ఈఎస్ శేషారెడ్డి, ఈఈలు ఎ. సోమయ్య, సి. హనుమ, మఘా ఇంజనీరింగ్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ రంగరాజన్, సంస్థ అధికారులు దగ్గరుండి పనులను పర్యవేక్షిస్తున్నారు.