Andhra Pradesh: బాలికలు, విద్యార్థినుల ఆరోగ్యం, పరిశుభ్రత కోసం ‘స్వేచ్ఛ’.. కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్

AP Government Starts Swechha Scheme For Girl Students

  • 10 లక్షల మంది విద్యార్థినులకు నాప్కిన్లు ఇవ్వనున్న సర్కార్
  • నెలకు 10 చొప్పున ఏటా 120 బ్రాండెడ్ నాప్కిన్లు
  • ప్రతి స్కూల్, కాలేజీలో నోడల్ ఆఫీసర్ గా మహిళా అధ్యాపకురాలు
  • గ్రామస్థాయిలోనూ మహిళలకు తక్కువ ధరకే నాప్కిన్లు

రాష్ట్రంలోని విద్యార్థినులు, బాలికల కోసం ‘స్వేచ్ఛ’ కార్యక్రమాన్ని ఏపీ సీఎం జగన్ ప్రారంభించారు. అందులో భాగంగా 7 నుంచి 12వ తరగతి చదువుతున్న 10 లక్షల మంది విద్యార్థినులకు శానిటరీ నాప్కిన్లను ఉచితంగా పంపిణీ చేస్తామని జగన్ చెప్పారు. నెలకు 10 చొప్పున సంవత్సరానికి 120 నాప్కిన్లను అందిస్తామన్నారు.

వేసవి సెలవులొస్తే స్కూల్ లో ఒకేసారి అందజేస్తారని చెప్పారు. దేశంలో 23 శాతం మంది బాలికల చదువులు ఆగిపోవడానికి కారణం.. రుతుక్రమ సమయంలో ఎదురవుతున్న సమస్యలేనంటూ యూఎన్ వాటర్ సప్లై, శానిటేషన్ కొలాబరేటివ్ కౌన్సిల్ నివేదికలో స్పష్టమైందని, వాటిని మార్చేందుకే ‘స్వేచ్ఛ’ను అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు.

బాలికల ఆరోగ్యం, పరిశుభ్రతలో భాగమే స్వేచ్ఛ కార్యక్రమమని చెప్పారు. దేవుడి సృష్టిలో భాగమైన రుతుక్రమంలో ఎదురయ్యే సమస్యలు, వాటి పరిష్కారాల గురించి మాట్లాడుకోవడం తప్పు అనే పరిస్థితి మారాలన్నారు. అలాంటి సమస్యలపై బాలికలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఎదిగే సమయంలో శరీరంలో వచ్చే మార్పులు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మహిళా టీచర్లు, అధ్యాపకులు, ఏఎన్ఎంలంతా విద్యార్థినులకు అవగాహన కల్పించాలని సూచించారు. నెలకోసారి ఓరియెంటేషన్ కార్యక్రమం నిర్వహించాలన్నారు.

స్వేచ్ఛ పథకం అమలు కోసం ప్రతి స్కూల్, కాలేజీలో నోడల్ అధికారిగా ఒక మహిళా అధ్యాపకురాలిని నియమిస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. వినియోగించిన నాప్కిన్లను డిస్పోజ్ చేసేందుకు వీలుగా రాష్ట్రవ్యాప్తంగా 6,417 ఇన్సినరేటర్లను ఏర్పాటు చేశామని, స్కూళ్లలోని బాత్రూంలలోనే ఇన్సినరేటర్లను పెట్టామని, వాటిలో వాడిపారేసిన నాప్కిన్లను పర్యావరణహితంగా దహనం చేస్తారని తెలిపారు. మున్సిపాలిటీల్లో వాటి కోసం ప్రత్యేకమైన డస్ట్ బిన్లను అందజేశామన్నారు.

కాగా, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 56,703 ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలో మన బడి నాడు–నేడు పథకం కింద అమ్మాయిల కోసం బాత్రూంలను నిర్మిస్తున్నామన్నారు. మొదటి విడతలో 15,715 బాత్రూంలను కడతామని, జూలై 2023 నాటికి అన్నింటినీ పూర్తి చేస్తామని చెప్పారు. వాటికి ప్రధానోపాధ్యాయుడితో కూడిన పేరెంట్స్ కమిటీతో పర్యవేక్షణ చేయిస్తామని, దానికి ప్రత్యేక నిధిని కేటాయిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. గ్రామస్థాయిలోనూ ప్రతి అక్కకు, చెల్లెమ్మకు తక్కువ ధరకే నాణ్యమైన శానిటరీ నాప్కిన్లను అందిస్తామన్నారు. వైఎస్సార్ చేయూత దుకాణాల ద్వారా వాటిని విక్రయిస్తామన్నారు.

  • Loading...

More Telugu News