Farmers Protest: ఎంపీ కావడానికి ముందు నేనేంటో అందరికీ బాగా తెలుసు.. జస్ట్ రెండు నిమిషాలు చాలు: రైతులపై కేంద్రమంత్రి తీవ్ర వ్యాఖ్యలు
- గత నెల 25న మంత్రి పర్యటనకు నిరసనగా నల్లజెండాలతో రైతుల నిరసన
- తాను తలచుకుంటే రైతులు రెండు నిమిషాల్లో పారిపోతారని హెచ్చరిక
- ఒక్కసారి సవాలును స్వీకరిస్తే వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్న మంత్రి
మంత్రిని, ఎంపీని కాకముందు తానేంటో ప్రజలకు తెలుసని, తాను తలచుకుంటే రైతులను దారిలో పెట్టేందుకు రెండు నిమిషాలు చాలంటూ హెచ్చరిస్తూ మాట్లాడిన కేంద్రమంత్రి అజయ్‌కుమార్ మిశ్రా వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్‌ఖేరిలో ఆదివారం ఆయన పర్యటన సందర్భంగా జరిగిన రైతుల ఆందోళన, అనంతరం చెలరేగిన హింసకు 9 రోజుల ముందు ఆయనీ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది.
గత నెల 25న మంత్రి తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఖేరి నియోజకవర్గంలో పర్యటించారు. విషయం తెలిసిన రైతులు నల్ల జెండాలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆగ్రహంతో ఊగిపోయిన మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. తాను తలచుకుంటే రైతులను దారిలో పెట్టేందుకు రెండు నిమిషాలకు మించి పట్టదని హెచ్చరించారు. తాను కనుక ఒక్కసారి సవాలును స్వీకరిస్తే వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. ‘‘నేను రంగంలోకి దిగితే మీరు (రైతులు) పాలియా నుంచే కాదు, లిఖింపూర్‌ను కూడా వదిలిపారిపోతారు’’ అంటూ మంత్రి హెచ్చరించారు.