Shane Bond: మేం ఇంకా పోటీలో ఉన్నాం.. ముంబై జట్టు బౌలింగ్ కోచ్ షేన్‌బాండ్
- ఢిల్లీ చేతిలో ఓటమి తర్వాత మాట్లాడిన ముంబై బౌలింగ్ కోచ్
- తాము అత్యుత్తమంగా ఆడటం లేదని అభిప్రాయం
- 12 మ్యాచుల తర్వాత 10 పాయింట్లతోనే నాలుగు జట్లు
ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఘోరంగా ఓడిపోయిన ముంబై జట్టు ప్లేఆఫ్ అవకాశాలను మరింత క్లిష్టతరం చేసుకుంది. ఈ క్రమంలో జట్టు బౌలింగ్ కోచ్ షేన్‌బాండ్ జట్టు పరిస్థితిపై పెదవివిప్పాడు. తమ జట్టు అత్యుత్తమంగా ఆడటం లేదని, కనీసం దాని దరిదాపుల్లో కూడా లేదని ఆయన అభిప్రాయపడ్డాడు. అయితే తాము ఇంకా ప్లేఆఫ్స్ పోటీ నుంచి తప్పుకోలేదని స్పష్టం చేశాడు. ఇప్పటి వరకూ ఐపీఎల్‌లో నాలుగు జట్లు 12 మ్యాచులు పూర్తి చేసుకున్నాయి. ఇవి పంజాబ్, కోల్‌కతా, ముంబై, రాజస్థాన్. ఇవన్నీ కూడా 10 పాయింట్లతో నాలుగో స్థానం కోసం పోటీ పడుతున్నాయి.
ముంబై జట్టు లీగ్ దశలో ఇంకా రెండు మ్యాచులు ఆడాల్సి ఉంది. ఈ రెంటిలో భారీ విజయాలు నమోదు చేస్తే నెట్ రన్‌రేట్ మెరుగ్గా ఉన్న కారణంగా ప్లేఆఫ్స్ చేరే అవకాశం ఉంది. అక్టోబరు 5న రాజస్థాన్‌తో, ఆ తర్వాత అక్టోబరు 8న సన్‌రైజర్స్‌తో ముంబై జట్టు తలపడనుంది. ఈ రెండు మ్యాచుల్లో కచ్చితంగా గెలిచి ప్లేఆఫ్స్ చేరాలని డిఫెండింగ్ ఛాంపియన్ ప్రయత్నిస్తోంది. అయితే జట్టు ఆటగాళ్లలో చాలా మంది ఫామ్‌లో లేకపోవడం ఆ జట్టు అవకాశాలను దారుణంగా దెబ్బతీస్తోంది.