TSRTC: టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మరో కీలక నిర్ణయం.. ఇకపై ప్రతినెల ఒకటో తేదీనే వేతనాలు
- ప్రస్తుతం 7-14 తేదీలోపు విడతల వారీగా వేతనాలు
- నేడు దాదాపు 48 వేలమంది ఉద్యోగులు, పింఛనుదారులకు వేతనాలు
- ఇకపై ఏడాదిపాటు ఉద్యోగులకు దీర్ఘకాలిక సెలవులు
టీఎస్ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కీలక నిర్ణయాలు తీసుకుంటూ ప్రశంసలు అందుకుంటున్న సజ్జనార్ మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు. టీఎస్ ఆర్టీసీ ప్రస్తుతం తీవ్ర నష్టాల్లో నడుస్తోంది. దీంతో ఉద్యోగులకు వేతనాలు సకాలంలో ఇవ్వడం గగనంగా మారుతోంది. ప్రస్తుతం ప్రతినెల 7వ తేదీ నుంచి 14వ తేదీలోపు విడతల వారీగా, జోన్ల వారీగా చెల్లిస్తున్నారు. అయితే, ఇకపై ప్రతినెల ఒకటో తేదీనే వేతనాలు ఇవ్వాలని నిర్ణయించిన సజ్జనార్ ఈ మేరకు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల నుంచే ఇది అమలు కానుంది.
దసరా నేపథ్యంలో నేడే వేతనాలు అందనుండడంతో ఉద్యోగుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, ఇటీవల ఆర్టీసీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన బాజిరెడ్డి గోవర్ధన్‌రెడ్డి కూడా ఉద్యోగులకు ప్రతినెల ఒకటో తేదీనే వేతనాలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీలోని దాదాపు 48 వేల మంది ఉద్యోగులు, పెన్షనర్లు నేడు వేతనాలు అందుకోనున్నారు. కాగా, ఆర్టీసీ మరో నిర్ణయం కూడా తీసుకుంది. దీర్ఘకాలిక సెలవులపై ఇప్పటి వరకు ఉన్న ఆంక్షలను ఎత్తివేసింది. ఇకపై డ్రైవర్లు, కండక్టర్లకు ఏడాదిపాటు దీర్ఘకాలిక సెలవులు మంజూరు చేస్తామని, అవసరమైనవారు దరఖాస్తు చేసుకోవాలని కోరింది.