Pawan Kalyan: గులాబ్ తుపాను బాధిత రైతులకు ఎకరాకు రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు ఇవ్వాలి: పవన్ కల్యాణ్
- ఏపీ జిల్లాల్లో గులాబ్ తుపాను బీభత్సం
- ఉత్తరాంధ్ర నుంచి కృష్ణా జిల్లా వరకు తీవ్రనష్టం
- మానవతా దృక్పథంతో ఆదుకోవాలన్న పవన్
- అరకొర సాయంతో ప్రయోజనం లేదని వెల్లడి
గులాబ్ తుపాను కారణంగా ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి కృష్ణా జిల్లా వరకూ అతలాకుతలం అయ్యాయని జనసేనాని పవన్ కల్యాణ్ తెలిపారు. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయని, వేలాది ఇళ్లలోకి నీరు ప్రవేశించి జనజీవనం అస్తవ్యస్తం అయిందని వివరించారు. తుపాను బాధిత కుటుంబాలను ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఉత్తరాంధ్రలో విద్యుత్ సరఫరా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతినడంతో పలు చోట్ల ప్రజలు అంధకారంలో ఉన్నారని పవన్ పేర్కొన్నారు.
ప్రకృతి విపత్తులకు ఎక్కువగా నష్టపోయే వర్గం రైతాంగమేనని, దాదాపు 2 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు. వరి పంట అధికంగా దెబ్బతిందని, అయితే ప్రభుత్వం పంట నష్ట పరిహారం లెక్కించే విధానాలు మారితేనే రైతులకు, కౌలు రైతులకు మేలు జరుగుతుందని పవన్ స్పష్టం చేశారు. నామమాత్రపు సాయంతో సరిపెడితే ప్రయోజనం ఉండదని, ఎకరానికి రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు పరిహారం ఇస్తేనే రైతులు కోలుకుంటారని పేర్కొన్నారు. ప్రభుత్వం ఈ దిశగా ఆలోచించాలని కోరారు.