Bharat Bundh: ఈ నెల 27న భారత్ బంద్... మద్దతు ప్రకటించిన వైసీపీ
- వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కేంద్రం సిద్ధం
- వ్యతిరేకిస్తున్న ఏపీలోని వివిధ వర్గాలు
- రైతు చట్టాల అమలుపైనా వ్యతిరేకత
- బంద్ పై తమ వైఖరి వెల్లడించిన పేర్ని నాని
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలిపివేయాలని, వ్యవసాయ చట్టాలను తొలగించాలని కోరుతూ ఈ నెల 27న భారత్ బంద్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ బంద్ కు ఏపీ అధికారపక్షం వైసీపీ పూర్తి మద్దతు తెలుపుతోంది. దీనిపై ఏపీ రవాణా శాఖ మంత్రి పేర్ని నాని స్పందించారు. ఈ బంద్ లో పాల్గొనే రైతు సంఘాలు శాంతియుత పంథా అనుసరించాలని కోరారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, రైతు చట్టాలను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నట్టు తెలిపారు.
భారత్ బంద్ కారణంగా... ఈ నెల 26 అర్ధరాత్రి నుంచి 27వ తేదీ మధ్యాహ్నం 1 గంట వరకు బస్సులు తిరగవని వెల్లడించారు. మధ్యాహ్నం 1 గంట తర్వాతే బస్సులు రోడ్లపైకి వస్తాయని పేర్ని నాని వివరించారు. ప్రజలు ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని అన్నారు.