Population Control Bill: సరైన సమయంలోనే జనాభా నియంత్రణ బిల్లు: యోగి ఆదిత్యనాథ్
- మీడియా సమావేశంలో మాట్లాడిన యూపీ సీఎం
- జులై నెలలో ముసాయిదా బిల్లు తయారు చేసిన ప్రభుత్వం
- ప్రజల నుంచి అభిప్రాయాలు, సూచనల సేకరణ
జనాభా బిల్లుపై ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. ఇలాంటి బిల్లులను సరైన సమయంలో తీసుకొస్తామని ఆయన చెప్పారు. ఈ బిల్లుకు సంబంధించిన ముసాయిదాను జులై నెలలో ప్రభుత్వం తన వెబ్‌సైటులో ఉంచింది. దీనిపై జులై 19 వరకు ప్రజల నుంచి అభిప్రాయాలు, సూచనలు సేకరించింది. తాజాగా ఒక మీడియా సమావేశంలో ఆదిత్యనాథ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బిల్లును ఎప్పుడు తీసుకొస్తారని ఆయన్ను విలేకరులు ప్రశ్నించారు. దీనికి బదులిస్తూ, సరైన సమయంలో బిల్లును తీసుకొస్తామని చెప్పారు. రామ మందిరం గురించి కూడా ఇలాగే ప్రశ్నించేవారని, కానీ గతేడాది ఆగస్టు 5న ప్రధాని నరేంద్ర మోదీ ఆలయానికి శంకుస్థాపన చేశారని ఆదిత్యనాథ్ అన్నారు. ఆర్టికల్ 370 గురించి కూడా ఆయన ప్రస్తావించారు.
‘‘అన్నింటికీ సరైన సమయం అంటూ ఒకటి ఉంటుంది. అలాగే సరైన చోటే అది జరగాల్సి ఉంటుంది’’ అంటూ జనాభా బిల్లు గురించి చెప్పారు. ఇటీవల వివాదాస్పదమైన ‘అబ్బా జాన్’ వ్యాఖ్యలపై కూడా ఆయన మాట్లాడారు. విపక్షాలు ముస్లిం ఓట్లు కోరుకుంటున్నాయని, కానీ అబ్బా జాన్ పదంతో ఇబ్బంది పడుతున్నాయని విమర్శించారు.