Kannababu: ఇప్పుడు ఎన్నికల బహిష్కరణ అంటే ప్రజలు నమ్మరు: టీడీపీపై మంత్రి కన్నబాబు విమర్శలు
- ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీ దూకుడు
- మంత్రి కన్నబాబు ప్రెస్ మీట్
- టీడీపీ నేతలు పరిషత్ ఎన్నికల్లో పాల్గొన్నారని వెల్లడి
- ఓటమికి కొత్త భాష్యాలు చెప్పొద్దని హితవు
పరిషత్ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం కనిపిస్తున్న నేపథ్యంలో ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మీడియా సమావేశం నిర్వహించారు. విపక్ష టీడీపీపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు తాము గతంలోనే బహిష్కరించినట్టు టీడీపీ చెబుతుండడంపై స్పందించారు.
టీడీపీ ఎన్నికల బహిష్కరణ ఓ డ్రామా అని పేర్కొన్నారు. టీడీపీ అభ్యర్థులకు బీఫారాలు ఇచ్చారని, ప్రచారం కూడా చేసుకున్నారని, ఎన్నికల్లోనూ పాల్గొన్నారని వెల్లడించారు. అన్నీ అయ్యాక ఇప్పుడు ఎన్నికల బహిష్కరణ అంటే ప్రజలు నమ్మరని కన్నబాబు స్పష్టం చేశారు. ఓటమికి కారణాలు, కొత్త భాష్యాలు చెబితే ప్రజలు విశ్వసించరని పేర్కొన్నారు.
పార్టీ లేదు, బొక్కా లేదు అని అచ్చెన్నాయుడు ఏ క్షణాన అన్నాడో కానీ, ఆయన చెప్పిన దాంట్లో నిజం ఉందని కన్నబాబు వ్యంగ్యం ప్రదర్శించారు. ఓటమిపాలైన ప్రతిసారీ ఎన్నికలకు వెళదాం అనడం టీడీపీ నేతలకు అలవాటైందని, ఇవన్నీ ఎన్నికలు కాదా అని కన్నబాబు ప్రశ్నించారు. చిత్తశుద్ధి ఉన్నవాళ్లయితే ఓటమిని అంగీకరించాలని స్పష్టం చేశారు.
మీరు అమితమైన ఆపేక్ష ప్రదర్శించే అమరావతిలోనే మీకు అనుకూల ఫలితాలు రాలేదు అని విమర్శించారు. టీడీపీ ఎన్ని కుట్రలకు పాల్పడినా ప్రజలు సీఎం జగన్ వెంట ఉన్నారని పరిషత్ ఎన్నికల ఫలితాలతో స్పష్టమైందని అన్నారు.