Dog: శునకంతో విమాన ప్రయాణం.. బిజినెస్ కేబిన్ మొత్తాన్ని బుక్ చేసుకున్న ప్రయాణికుడు
- ఎయిర్ ఇండియా విమానంలోని 12 బిజినెస్ క్లాస్ సీట్లను బుక్ చేసుకున్న ప్రయాణికుడు
- ముంబై నుంచి చెన్నైకి వచ్చేందుకు రూ. 2.50 లక్షలు వెచ్చించిన వైనం
- పెంపుడు జంతువుల ప్రయాణానికి ఎయిర్ ఇండియా మాత్రమే అనుమతి
ముంబైకి చెందిన ప్రయాణికుడు ఒకరు తన పెంపుడు శునకంతో కలిసి విమాన ప్రయాణం చేసేందుకు బిజినెస్ క్లాస్ మొత్తాన్ని బుక్ చేసుకున్నాడు. ఇందుకోసం ఏకంగా రెండున్నర లక్షల రూపాయలు ఖర్చు చేశాడు. ముంబై నుంచి చెన్నైకి తన పెంపుడు శునకంతో రావాలనుకున్న ప్రయాణికుడు దాని వల్ల తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఉండడంతోపాటు దానికి సౌకర్యంగా ఉండేందుకు ఎయిర్ ఇండియా విమానం ఏఐ-671 బిజినెస్ క్లాస్ కేబిన్‌లోని 12 సీట్లను రూ. 2.50 లక్షలు వెచ్చించి బుక్ చేసుకున్నాడు. బుధవారం ఈ విమానంలో ముంబై నుంచి చెన్నైకి చేరుకున్నట్టు తెలుస్తోంది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఎయిర్ ఇండియా విమానంలోని బిజినెస్ క్లాస్‌లో శునకాలతో గతంలోనూ పలువురు ప్రయాణించారు. అయితే, దాని కోసం బిజినెస్ క్లాస్ కేబిన్ మొత్తాన్ని బుక్ చేసుకోవడం మాత్రం ఇదే తొలిసారి. అంతేకాదు, పెంపుడు జంతువులతో కలిసి ప్రయాణించేందుకు అనుమతించే విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా మాత్రమే. ఒక విమానంలో గరిష్ఠంగా రెండు పెంపుడు జంతువులకు మాత్రమే అనుమతి ఉంది. అది కూడా చివరి వరుసలో ప్రయాణానికి మాత్రమే అనుమతి ఉంది. గతేడాది జూన్-సెప్టెంబరు మధ్య ఎయిర్ ఇండియా దేశీయ విమానాల్లో 2,000 పెంపుడు జంతువులు ప్రయాణించాయి.