Madan Lal: తదుపరి టీ20 కెప్టెన్ రోహిత్ శర్మే... దీనిపై మరో వాదనకు తావుండదని అనుకుంటున్నా: మదన్ లాల్

Madan Lal counts on Rohit Sharma as next captains

  • భారత టీ20 కెప్టెన్సీకి కోహ్లీ గుడ్ బై
  • టీ20 వరల్డ్ కప్ తర్వాత తప్పుకోనున్న వైనం
  • తదుపరి కెప్టెన్ ఎవరంటూ చర్చ
  • తన ఓటు రోహిత్ శర్మకేనన్న మదన్ లాల్
  • బీసీసీఐ క్రికెట్ అడ్వైజరీ కమిటీ చీఫ్ గా వున్న మదన్ లాల్

భారత టీ20 కెప్టెన్ గా తప్పుకుంటున్నట్టు విరాట్ కోహ్లీ ప్రకటించడంతో, తదుపరి కెప్టెన్ ఎవరన్నదానిపై చర్చ మొదలైంది. భారత క్రికెట్ దిగ్గజం మదన్ లాల్ స్పందిస్తూ, రోహిత్ శర్మే తదుపరి టీ20 సారథి అని అభిప్రాయపడ్డారు. దీనిపై మరో వాదనకు తావులేదని భావిస్తున్నానని, భారత టీ20 జట్టును నడిపించేందుకు రోహిత్ శర్మ అన్ని విధాలుగా సరిపోతాడని పేర్కొన్నారు.

మదన్ లాల్ ప్రస్తుతం బీసీసీఐ క్రికెట్ అడ్వైజరీ కమిటీ చీఫ్ గా వ్యవహరిస్తున్నారు. కోహ్లీ ఈ సాయంత్రం ట్విట్టర్ లో ప్రకటన చేసిన అనంతరం మదన్ లాల్ తన అభిప్రాయాలను పంచుకున్నారు.

ఐపీఎల్ లో ఐదుసార్లు ముంబయి ఇండియన్స్ ను విజేతగా నిలిపిన రోహిత్ శర్మ అనుభవం ఎంతో అక్కరకు వస్తుందని అన్నారు. సెలెక్టర్లు టీ20 జట్టు కెప్టెన్ గా రోహిత్ శర్మకు అవకాశం ఇస్తే, అదే సమయంలో భారత వన్డే జట్టు సారథ్యంపైనా చర్చ జరిగే అవకాశం ఉందని మదన్ లాల్ తెలిపారు.

టీ20 జట్టు కెప్టెన్సీ విషయానికొస్తే, సెలెక్షన్ కమిటీ సమావేశంలో రోహిత్ శర్మ కాకుండా మరొకరి పేరు వినిపిస్తుందని తాను భావించడంలేదని స్పష్టం చేశారు. కోహ్లీ సారథ్యంలో వైస్ కెప్టెన్ గా కొనసాగిన రోహిత్ శర్మ ఆ విధంగానూ ఎంతో అనుభవం గడించాడని అన్నారు. 

  • Loading...

More Telugu News