Virat Kohli: టీమిండియా టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్న విరాట్ కోహ్లీ
- కోహ్లీ కీలక నిర్ణయం
- టీ20 కెప్టెన్సీకి వీడ్కోలు
- టీ20 వరల్డ్ కప్ తర్వాత కెప్టెన్ గా కొనసాగబోనని వెల్లడి
- ఆటగాడిగా కొనసాగుతానని వెల్లడి
టీమిండియా సారథి విరాట్ కోహ్లీ టీ20 సారథ్య బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. ఇకపై టెస్టులు, వన్డేల్లో మాత్రమే కెప్టెన్ గా కొనసాగుతానని స్పష్టం చేశాడు. మూడు ఫార్మాట్లలోనూ కెప్టెన్సీ బాధ్యతలు మోస్తుండడం వల్ల అధికభారం పడుతోందని తెలిపాడు. వచ్చే నెలలో దుబాయ్ వేదికగా జరిగే టీ20 వరల్డ్ కప్ భారత టీ20 జట్టు కెప్టెన్ గా తనకు చివరి ఈవెంట్ అని వెల్లడించాడు. అయితే ఓ బ్యాట్స్ మన్ గా టీ20 జట్టులో కొనసాగుతానని కోహ్లీ స్పష్టత నిచ్చాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో ప్రకటన చేశాడు.
"భారత జట్టుకు ఆటగాడిగానూ, కెప్టెన్ గానూ ప్రాతినిధ్యం వహించేందుకు అవకాశాలు లభించడాన్ని అదృష్టంగా భావిస్తాను. నా ఈ కెప్టెన్సీ ప్రస్థానంలో ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, సెలెక్షన్ కమిటీ సభ్యులు, నా కోచ్ లు, మేం గెలవాలని ప్రార్థించే ప్రతి ఒక్క భారతీయుడి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి... వీళ్లు లేకుండా నేను లేను.
అయితే కెరీర్ లో పనిభారం గురించి కూడా అర్థం చేసుకోవాలి. గత 8-9 ఏళ్లుగా 3 ఫార్మాట్లలో తీవ్ర ఒత్తిడి భరిస్తున్నాను. ఐదారేళ్లుగా కెప్టెన్ గానూ అదనపు భారం పడుతోంది. ఈ పరిస్థితుల్లో టెస్టులు, వన్డేల్లో శక్తిమేర ప్రదర్శన చూపాలంటే నాకు నేను కొంత వెసులుబాటు కల్పించుకోవాలని నిర్ణయించుకున్నాను. టీ20 కెప్టెన్ గా ఇప్పటివరకు జట్టుకోసం సర్వశక్తులు ధారపోశాను. ఇకపైనా ఓ ఆటగాడిగా టీ20 జట్టులో కొనసాగుతాను.
టీ20 కెప్టెన్సీ వదులుకోవాలన్న నిర్ణయం వెనుక నా సన్నిహితులతోనూ, కోచ్ రవిభాయ్ తోనూ, సహచరుడు రోహిత్ శర్మతోనూ ఎంతో చర్చించాను, ఎంతో ఆలోచించాను. అన్ని విషయాలు పరిగణనలోకి తీసుకున్న పిమ్మట అక్టోబరులో జరిగే టీ20 వరల్డ్ కప్ అనంతరం టీమిండియా టీ20 కెప్టెన్సీ బాధ్యతలు వదులుకోవాలని నిర్ణయించుకున్నాను. ఈ విషయాన్ని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జై షా, సెలక్టర్లకు వివరించాను" అని వెల్లడించాడు.