Suicide: పోలీసులపై నమ్మకం లేదు.. మృతదేహాన్ని ఇక్కడకు తీసుకురావాల్సిందే: సైదాబాద్ బాధిత బాలిక తండ్రి
- మృతదేహాన్ని తీసుకురావాలని డిమాండ్
- తాము చూసి గుర్తుపడతామని స్పష్టీకరణ
- రాజు ఆత్మహత్యపై అనుమానాలున్నాయని వ్యాఖ్య
సైదాబాద్ లోని సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడి, చంపేసిన నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్న ఘటనపై.. బాధిత బాలిక తండ్రి స్పందించారు. పోలీసులపై తమకు నమ్మకం లేదని తేల్చి చెప్పారు. నిందితుడు చనిపోయాడంటే తాము నమ్మబోమని అన్నారు. మృతదేహాన్ని ఇక్కడకు తీసుకురావాల్సిందేనని స్పష్టం చేశారు. చనిపోయింది రాజేనా? కాదా? అన్న విషయాన్ని తాము గుర్తిస్తామని చెప్పారు. తమ బిడ్డను చేతుల్లో నుంచి లాక్కుపోయారు కదా.. ఇప్పుడు అతడి డెడ్ బాడీని తీసుకురావాల్సిందేనన్నారు.
అతడు బతికుంటే చంపేస్తామన్న భయం ఉండొచ్చేమో.. కానీ, ఇప్పుడు అతడు చనిపోయాడు కదా తీసుకురావడానికేంటి? అంటూ ప్రశ్నించారు. రాజు చనిపోయాడన్న వార్తలపై తమకు ఎన్నో అనుమానాలున్నాయన్నారు. మృతదేహాన్ని చూస్తేనే నమ్ముతామన్నారు. ఆ రోజు రాజు గది తలుపులను పగులగొట్టమని మేం 7 గంటలకు డిమాండ్ చేస్తే.. 12 గంటలకు పగులగొట్టారని, అలాంటి పోలీసుల మాటలను తామెలా నమ్ముతామని ఆయన ప్రశ్నించారు.