Oscar Fernandes: కాంగ్రెస్ సీనియర్ నేత ఆస్కార్ ఫెర్నాండెజ్ కన్నుమూత

Congress veteran Oscar Fernandes dead

  • గత జులైలో యోగా చేస్తూ కిందపడ్డ ఫెర్నాండెజ్
  • అప్పటి నుంచి ఆసుపత్రిలోనే ఉన్న కేంద్ర మాజీ మంత్రి
  • ఆయన వయసు 81 సంవత్సరాలు

కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ఆస్కార్ ఫెర్నాండెజ్ కన్నుమూశారు. మంగళూరులో ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ ఏడాది జులైలో ఇంట్లో యోగా చేస్తున్న సందర్భంగా ఆయన కిందపడ్డారు. ఈ ప్రమాదంలో ఆయన మెదడులో రక్తం గడ్డకట్టింది. వెంటనే ఆయనను ఐసీయూలో చేర్చారు.

గడ్డకట్టిన రక్తాన్ని తొలగించేందుకు ఆయనకు సర్జరీ నిర్వహించారు. అప్పటి నుంచి ఆయన మంగళూరులోని ఆసుపత్రిలో ఐసీయూలోనే ఉన్నారు. మృత్యువుతో పోరాటం చేస్తూ ఈరోజు ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 81 సంవత్సరాలు. ఆయనకు భార్య బ్లోసమ్ ఫెర్నాండెజ్, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయన మృతి పట్ల పార్టీలకు అతీతంగా నేతలు సంతాపం ప్రకటిస్తున్నారు.

1941 మార్చి 27న ఉడుపిలో ఆస్కార్ ఫెర్నాండెజ్ జన్మించారు. ఆయన తండ్రి రోక్ ఫెర్నాండెజ్ గొప్ప ఉపాధ్యాయుడిగా పేరుగాంచారు. తొలినాళ్లలో ఎల్ఐసీ ఏజెంట్ గా ఆస్కార్ ఫెర్నాండెజ్ పని చేశారు. ఆ తర్వాత మణిపాల్ లో చిన్న వ్యాపారాన్ని ప్రారంభించారు.

ఇదే సమయంలో వ్యవసాయం కూడా చేశారు. వరిని పండించిన అత్యుత్తమ రైతుగా అవార్డును కూడా పొందారు. ఇదే సమయంలో సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా ఆయన చురుకుగా పాల్గొనేవారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఒక కార్యకర్తగా చేరి, అంచెలంచెలుగా ఎదిగి పార్టీలో కీలక నేతల్లో ఒకరిగా ఎదిగారు. నాలుగుసార్లు ఎంపీగా, రెండు సార్లు రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు.

  • Loading...

More Telugu News