Kabul: తాలిబన్లు అధికారాన్ని చేపట్టిన తర్వాత కాబూల్ లో ల్యాండ్ అయిన తొలి అంతర్జాతీయ విమానం
- కాబూల్ లో ల్యాండ్ అయిన పాకిస్థాన్ ఎయిర్ లైన్స్ విమానం
- రెగ్యులర్ గా కమర్షియల్ విమానాలను నడపాలనుకుంటున్న పాక్
- జనాల తరలింపు సమయంలో బాగా డ్యామేజ్ అయిన కాబూల్ విమానాశ్రయం
ఆఫ్ఘనిస్థాన్ ను తాలిబన్లు చేజిక్కించుకున్న తర్వాత... ఎంతో మంది భయంతో దేశాన్ని విడిచి వెళ్లేందుకు యత్నించారు. అక్కడి నుంచి జనాలను పలు దేశాలు తమ విమానాల ద్వారా తరలించాయి. కాబూల్ నుంచి బయటకు వెళ్లడమే కానీ... ఆ దేశంలోకి ఏ విమానం రాలేదు. ఈరోజు తొలి అంతర్జాతీయ విమానం కాబూల్ లో ల్యాండ్ అయింది. ఆ విమానం పాకిస్థాన్ ఎయిర్ లైన్స్ ది కావడం గమనార్హం.
తాలిబన్లకు పాకిస్థాన్ మద్దతిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ దేశానికి చెందిన విమానం కాబూల్ ఎయిర్ పోర్టుకు చేరుకుంది. విమానంలో 10 మంది వరకు ఉంటారని ఏఎఫ్పీ జర్నలిస్ట్ మీడియా సంస్థ తెలిపింది. వీరిలో చాలా మంది విమాన సిబ్బందే ఉండొచ్చని అభిప్రాయపడింది. గత వారాంతంలో పాకిస్థాన్ ఎయిర్ లైన్స్ అధికార ప్రతినిధి మాట్లాడుతూ, ఆఫ్ఘనిస్థాన్ కు రెగ్యులర్ గా కమర్షియల్ విమానాలను నడిపేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే పాక్ నుంచి తొలి విమానం ఆప్ఘనిస్థాన్ కు చేరుకుంది.
కాబూల్ ఎయిర్ పోర్టు నుంచి దాదాపు లక్ష 20 వేల మందికి పైగా జనాలను తరలించారు. ఈ తరలింపు సమయంలో, పలు కారణాల వల్ల ఎయిర్ పోర్ట్ చాలా వరకు డ్యామేజ్ అయింది. ఎయిర్ పోర్టును మళ్లీ సాధారణ స్థితికి తెచ్చేందుకు ఖతార్ తో పాటు ఇతర దేశాల టెక్నికల్ సహకారాన్ని తీసుకోవాలని తాలిబన్లు యోచిస్తున్నారు.