Andhra Pradesh: కల్తీ మాంసం, చేపలు అమ్మేందుకే మటన్ మార్టులా?: ఏపీ ప్రభుత్వంపై బుద్ధా వెంకన్న విమర్శలు
- బలహీన వర్గాల కడుపుకొట్టేందుకే ఈ నిర్ణయం
- విజయసాయి రెడ్డి సలహాతోనే జగన్ నిర్ణయం
- వారి ఖజానా నింపుకొనేందుకే మటన్ మార్టులు
ఏపీ ప్రభుత్వం తీసుకురాబోతున్న మటన్ మార్టుల వ్యవహారంపై టీడీపీ ఏపీ ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న విమర్శలు గుప్పించారు. మాంసం, చేపలు, రొయ్యలు అమ్ముకుని బతికే బడుగు, బలహీన వర్గాల కడుపు కొట్టేందుకే ఈ మార్టులను ఏర్పాటు చేస్తున్నారంటూ విమర్శించారు. పీజీలు, డిగ్రీలు చేసిన వారికి ఉద్యోగాలు ఇవ్వలేని అసమర్థ సీఎం.. వారికి మటన్ కొట్లలో ఉద్యోగాలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇప్పటికే ప్రభుత్వ మద్యం దుకాణాల్లో కల్తీ మద్యం తాగి ఎంతో మంది చనిపోతున్నారని విమర్శించిన ఆయన.. ఇప్పుడు కల్తీ మాంసం, చేపలను అమ్మేందుకే కొత్తగా ఈ మటన్ మార్టులను ఏర్పాటు చేయాలనుకుంటున్నారని మండిపడ్డారు. విజయసాయిరెడ్డి సలహాతోనే ఏపీ సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని, వారి ఖజానా నింపుకొనేందుకే ఈ నిర్ణయమని అన్నారు. కొత్త సంస్థలను తీసుకొచ్చే సత్తా రాష్ట్ర ప్రభుత్వానికి లేదని అన్నారు. మాంసం అమ్మకాల కోసం ఏర్పాటు చేయాలనుకుంటున్న మటన్ మార్టుల నిర్ణయాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.