ECB: "ఐదో టెస్టును టీమిండియా వదులుకుంది" అన్న ఈసీబీ... ఆ తర్వాత కాసేపటికే సవరణ ప్రకటన!
- టీమిండియాలో కరోనా కలకలం
- నేడు ప్రారంభం కావాల్సిన ఐదో టెస్టుపై ప్రభావం
- ఆడలేమని నిస్సహాయత వ్యక్తం చేసిన భారత్
- ఈసీబీతో బీసీసీఐ చర్చలు
భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య నేడు ప్రారంభం కావాల్సిన ఐదో టెస్టు కరోనా ప్రభావంతో వాయిదా పడింది. అయితే, ఈ సందర్భంగా ఆసక్తికర పరిణామాలు జరిగాయి. తమ కోచింగ్ సిబ్బంది కరోనా బారినపడడంతో భారత్ ఈ మ్యాచ్ ఆడడంపై నిస్సహాయత వ్యక్తం చేసింది. దాంతో ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఓ ప్రకటన చేస్తూ, టీమిండియా ఈ మ్యాచ్ ను వదులుకుంది అని వెల్లడించింది.
మ్యాచ్ ను వదులుకోవడం అంటే ఓటమిపాలవడంగానే పరిగణిస్తారు. అదే జరిగితే ఈ సిరీస్ ను ఇంగ్లండ్ 2-2తో సమం చేసినట్టుగా భావించాలి. ప్రస్తుతం ఈ ఐదు టెస్టుల సిరీస్ లో కోహ్లీ సేన 2-1తో ముందంజలో ఉంది. ఈ నేపథ్యంలో ఈసీబీ ప్రకటన పట్ల బీసీసీఐ వెంటనే స్పందించింది.
ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు పెద్దలతో చర్చించి సమస్యను వారికి వివరించింది. బీసీసీఐ సంప్రదింపుల అనంతరం ఈసీబీ తన మొదటి ప్రకటనను సవరించుకుంది. వదులుకుంది అనే మాటను తీసేసి మరో ప్రకటన చేసింది. బీసీసీఐతో చర్చల అనంతరం ఐదో టెస్టును రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. దాంతో ఈ వ్యవహారం సద్దుమణిగింది.