Pakistan: ఆఫ్ఘనిస్థాన్‌లో పర్యటిస్తోన్న పాక్ ఐఎస్ఐ చీఫ్
![Pakistan ISI Chief In Kabul As Taliban Finalise Government Formation](https://imgd.ap7am.com/thumbnail/cr-20210905tn61345542dc278.jpg)
- తాలిబన్లు ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు
- సహకరిస్తోన్న పాక్
- ఆఫ్ఘన్లో శాంతి స్థాపనకు కృషి చేస్తామంటోన్న పాక్
ఆఫ్ఘనిస్థాన్‌ను స్వాధీనం చేసుకున్న తాలిబన్లు ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు జరుపుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాలిబన్ల ముఖ్యనేత ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని తాలిబన్లు భావిస్తున్నారు.
ఈ సమయంలో పాకిస్థాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) చీఫ్, లెఫ్టినెంట్ జనరల్ ఫయీజ్ హమీద్ ఆఫ్ఘన్లో పర్యటిస్తున్నారు. తాలిబన్ల నాయకులతో ఆయన చర్చలు జరపనున్నారు. ఆయన వెంట పలువురు పాకిస్థాన్ సీనియర్ అధికారులు కూడా ఉన్నారు. తాలిబన్ల ఆహ్వానం మేరకు వారు ఆఫ్ఘన్‌కు వెళ్లారు.
ఆఫ్ఘన్లో ప్రభుత్వ ఏర్పాటుకు పాకిస్థాన్ సహకరిస్తుందని ఇప్పటికే బ్రిటిష్ విదేశాంగ మంత్రి డోమినిక్ రాబ్‌కు పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ జావెద్ బజ్వా తెలిపారు. ఆఫ్ఘన్లో శాంతి స్థాపనకు, స్థిరమైన అభివృద్ధికి తాము సహకరిస్తామని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం డోమినిక్ రాబ్ పాక్ పర్యటనలో ఉన్నారు.
తాలిబన్లు ఇప్పటికే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉండగా, పలు కారణాల వల్ల ఆ ప్రక్రియను వచ్చేవారానికి వాయిదా వేశారు. ఆఫ్ఘన్లో తాలిబన్ల చర్యలపై ప్రపంచం మొత్తం ఆందోళన వ్యక్తం చేస్తుండగా పాక్ మాత్రం తాలిబన్లకు సహకరిస్తోంది. ఆఫ్ఘన్‌లోని పంజ్‌షీర్ లోయలో మాత్రం తాలిబన్లకు తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. అక్కడి తిరుగుబాటు దళం తమ పోరాటాన్ని కొనసాగిస్తోంది.