Gopala Krishnareddy: చిత్తూరు జిల్లాలో అభినవ శ్రవణుడు... ఎనిమిదేళ్ల వయసులో ఆటో నడుపుతూ కుటుంబ పోషణ!
- కుటుంబం కోసం చదువును త్యాగం చేసిన చిన్నారి
- ఎలక్ట్రిక్ ఆటో నడుపుతూ కుటుంబ పోషణ
- స్పందించిన లోకేశ్
- ఆదుకుంటానని భరోసా
ఎనిమిదేళ్ల వయసులో పిల్లలు హాయిగా స్కూలుకు వెళ్లి చదువుకుంటూ, ఆడుతూపాడుతూ ఉండడం సాధారణంగా కనిపించే విషయం. కానీ చిత్తూరు జిల్లా గంగుడుపల్లె గ్రామంలో నివసించే గోపాలకృష్ణారెడ్డి గాథ అందుకు భిన్నం. ఈ 8 ఏళ్ల చిన్నారి కుటుంబ పోషణ కోసం ఆటో నడుపుతున్నాడు. అంత చిన్న వయసులో ఆటో నడపడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసినా, అతడి కుటుంబ పరిస్థితి తెలిసి అయ్యో.. పాపం అనకుండా ఉండలేరు.
తల్లిదండ్రులిద్దరూ పుట్టుగుడ్డి కాగా, ప్రభుత్వం నెల నెలా రూ.3 వేలు అందిస్తోంది. తండ్రి పాపిరెడ్డి చిన్న దుకాణం నిర్వహిస్తున్నాడు. వీరికి ముగ్గురు పిల్లలు కాగా, వారిలో గోపాలకృష్ణారెడ్డి పెద్దవాడు. ఈ నేపథ్యంలో ఇంటికి పెద్దకొడుకైన గోపాలకృష్ణారెడ్డి తనకంటే చిన్నవాళ్లయిన తోబుట్టువుల భవిష్యత్తు కోసం కుటుంబ బాధ్యతను భుజానికెత్తుకున్నాడు. ప్రస్తుతం 3వ తరగతి చదువుతున్న గోపాలకృష్ణారెడ్డి ఎలక్ట్రిక్ ఆటో నడుపుతూ ఎంతోకొంత సంపాదిస్తూ తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉంటున్నాడు.
అయితే ఇంత చిన్నవయసులో ఆటో నడుపుతుండడం నిబంధనలకు విరుద్ధమే అయినా, అతడి పరిస్థితి తెలిసి టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ సైతం సానుభూతి వ్యక్తం చేశారు. వారి కుటుంబం నెలసరి వాయిదాల పద్ధతిలో కొనుగోలు చేసిన ఆ ఆటో కిస్తీలు చెల్లింపుకు లోకేశ్ ముందుకొచ్చారు. కొందరు దాతల సహకారం తీసుకోవాలని నిర్ణయించారు. అంతేకాదు, గోపాలకృష్ణారెడ్డిని స్కూల్లో చేర్చేందుకు ఆయన నిర్ణయించారు. ఆ చిన్నారి చదువు విషయంలో తాము సాయం చేస్తామని ప్రకటించారు. ఈ దిశగా టీడీపీ నుంచి రూ.50 వేలు అందజేయనున్నారు.
చిన్నారి గోపాలకృష్ణారెడ్డి అంశం సోషల్ మీడియాలో వైరల్ అయింది. అతడు ఆటో నడుపుతున్న వీడియో సందడి చేస్తోంది. నాడు రామాయణంలో శ్రవణుడు అంధులైన తన తల్లిదండ్రులను కావడిలో మోసిన వైనాన్ని, నేడు గోపాలకృష్ణారెడ్డి ఉదంతంతో పోల్చవచ్చు.