AP High Court: ఏపీలో విద్యాదీవెన పథకంపై కీలక ఆదేశాలు వెలువరించిన హైకోర్టు
- ఏపీలో జగనన్న విద్యాదీవెన పథకం
- తల్లుల ఖాతాల్లోకి కాలేజీ ఫీజుల నగదు బదిలీ
- తల్లులు చెల్లించకపోతే ఏమీ చేయలేమన్న ప్రభుత్వం
- తాము నష్టపోతామన్న కృష్ణదేవరాయ విద్యాసంస్థలు
జగనన్న విద్యాదీవెన పథకం కింద తల్లుల ఖాతాలో డబ్బు జమ చేయడంపై దాఖలైన పిటిషన్ ను హైకోర్టు విచారించింది. తల్లులు తమ ఖాతాలో పడిన నగదును కాలేజీలకు చెల్లించకపోతే తాము ఏమీ చేయలేమని ప్రభుత్వం పేర్కొనడాన్ని కృష్ణదేవరాయ విద్యాసంస్థలు హైకోర్టులో సవాల్ చేశాయి. ఫీజులను నేరుగా కాలేజీల ఖాతాల్లోకి జమ చేయాలని పిటిషనర్ కోరారు. తల్లిదండ్రులు ఆ నగదును కాలేజీల్లో చెల్లించకపోతే యాజమాన్యాలే నష్టపోతాయని తమ పిటిషన్ లో వివరించారు.
ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం... వాదనలు విన్న పిమ్మట కీలక ఆదేశాలు జారీ చేసింది. జగనన్న విద్యాదీవెన పథకం ద్వారా అందించే నగదును విద్యాసంస్థ ప్రిన్సిపల్ ఖాతాలో జమ చేయాలని స్పష్టం చేసింది. ఈ పిటిషన్ పై విచారణ ఇటీవల జరగ్గా, తీర్పు కాపీలను హైకోర్టు తాజాగా వెబ్ సైట్ లోకి అప్ లోడ్ చేసింది.