Afghanistan: తాలిబన్లు హెలికాప్టర్ నుంచి వ్యక్తిని వేలాడదీశారంటూ వచ్చిన ఆ వార్త ఫేక్ అట!
- స్థానిక జర్నలిస్టులు, పలు వీడియోల ద్వారా ధ్రువీకరణ
- తాలిబన్ల జెండాలను పెట్టేందుకు ప్రయత్నం
- వేలాడిన వ్యక్తి కూడా తాలిబన్ గ్రూపుకు చెందిన వాడే
అమెరికన్ల నుంచి ఆఫ్ఘనిస్థాన్ ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్న తర్వాత.. జనాలు ఆ దేశం నుంచి బయటపడేందుకు ఎంతగానో ప్రయత్నించారు. కొందరు చనిపోయారు. మరికొందరు చావు అంచులదాకా వెళ్లొచ్చారు. కారణం, తాలిబన్ల ఆగడాలు. ఒకప్పటి వారి నరమేధాన్ని గుర్తు తెచ్చుకుని మంచి భవిష్యత్ కోసం ఎందరో దేశాన్ని వీడుతున్నారు. అలాంటి వారి భయాలను నిజం చేస్తూ తాలిబన్లు చాలా చోట్ల ఆగడాలకు తెగబడ్డారు కూడా. జర్నలిస్టులపై దాడులు చేశారు.. ఎదురు తిరిగిన వారిని చంపేశారు.. ఆఫ్ఘన్ సైనికులను వరుసలో కూర్చోబెట్టి కాల్చేశారు.
ఆ కోవలోనే నిన్న ఓ వీడియో చక్కర్లు కొట్టింది. హెలికాప్టర్ కు ఓ వ్యక్తిని కట్టి గాల్లోకి వేలాడదీస్తున్న ఆ వీడియో వైరల్ అయింది. అమెరికాకు ఇంటర్ ప్రిటర్ (అనువాదకుడు)గా పనిచేశాడన్న అనుమానంతో తాలిబన్లు అతన్ని చంపేశారని, ఆ తర్వాత శవాన్ని అలా ఊరేగించారని వార్తలు వెలువడ్డాయి. ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ సంస్థలన్నీ అదే విషయంతో కథనాన్నిచ్చాయి.
అయితే, అదంతా కట్టుకథ అని కొన్ని వీడియోలు, కొందరి వాదనలు స్పష్టం చేస్తున్నాయి. వాస్తవానికి హెలికాప్టర్ నుంచి వేలాడుతున్న వ్యక్తి చనిపోలేదు. కాందహార్ ప్రావిన్స్ లో ఎత్తైన జెండా కర్రలకు తాలిబన్ల జెండాలను పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నాడట. అందులో భాగంగానే ఓ వంద మీటర్ల పోల్ కు జెండాను పెట్టే ప్రయత్నం చేయగా అది ఫలించలేదట.
స్థానిక జర్నలిస్టులు, నిపుణులు ఆ విషయాన్ని స్పష్టం చేశారు. ఆ వాదనలకు బలం చేకూర్చే వీడియోలూ సోషల్ మీడియాలో ఉన్నాయి. ఆ వీడియోల్లోని వ్యక్తి కదులుతూ కూడా కనిపించాడు. కేవలం నడుముకే తాడును కట్టి అతడిని గాల్లో తీసుకెళ్లారు. అలా వేలాడిన వ్యక్తి కూడా తాలిబన్ గ్రూపుకు చెందినవాడే.
వాషింగ్టన్ పోస్ట్ చీఫ్ ఎడిటర్ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. తాలిబన్ అనగానే తప్పుడు వార్తలు గుట్టలుగుట్టలుగా వస్తున్నాయన్నారు. ఇంటర్నెట్ లో విషయాలను తప్పుగా చెబుతున్నారన్నారు. బ్లాక్ హాక్ హెలికాప్టర్ నుంచి వ్యక్తిని వేలాడదీశారన్నది బూటకమని చెప్పారు.