Nara Lokesh: రూ.2,500 ఇవ్వలేని ఈ ప్రభుత్వం రూ.10 లక్షలు ఇవ్వగలదా?: నారా లోకేశ్
- పశ్చిమ గోదావరి జిల్లాలో లోకేశ్ పర్యటన
- పోలవరం నిర్వాసితులతో సమావేశం
- వైసీపీ నేతలపై విమర్శలు
- జగన్ వన్నీ గాలికబుర్లని వ్యాఖ్యలు
టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ నేడు పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనకు వెళ్లారు. కూనవరం మండలంలోని పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులతో ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. పోలవరం నిర్వాసితులకు ఇళ్లు కట్టిస్తామన్న సర్కారు ఇప్పటివరకు మాట నిలుపుకోలేదని అన్నారు. నిర్వాసితులకు ఒక్క ఇల్లు కూడా కట్టించలేదని వ్యాఖ్యానించారు.
రెండేళ్ల కిందట వరదలు వస్తే ఈ సర్కారు నిర్వాసితులను ఆదుకోలేకపోయిందని విమర్శించారు. నాడు నిర్వాసితులకు రూ.2,500 ఇవ్వలేని ప్రభుత్వం ఇప్పుడు రూ.10 లక్షలు ఇస్తుందా? అని ప్రశ్నించారు. పోలవరం వెనుక 1.90 లక్షల మంది ప్రజల తాగ్యం ఉందని, కానీ వైసీపీ నేతలు మాత్రం ఇది చిన్న అంశం అంటూ తీసిపారేస్తున్నారని లోకేశ్ ఆరోపించారు. నిర్వాసితులను సీఎం జగన్ జలసమాధి చేస్తున్నాడని మండిపడ్డారు.
అసలు, ఈ జులై నాటికి పోలవరం పూర్తి చేస్తామన్న ప్రభుత్వం ఇప్పటివరకు ఏంచేసిందని నిలదీశారు. గత రెండున్నరేళ్లలో పోలవరం కోసం ఈ ప్రభుత్వం ఖర్చు చేసింది రూ.850 కోట్లేనని వెల్లడించారు. నాడు పోలవరం ప్రాజెక్టు పనులను చంద్రబాబు పరుగులు పెట్టించారని, కానీ జగన్ వచ్చాక పోలవరాన్ని చంపేస్తున్నాడని వ్యాఖ్యానించారు. రివర్స్ టెండరింగ్ అని చెప్పుకోవడం తప్ప ప్రాజెక్టు పనుల్లో పురోగతి లేదని అన్నారు. జగన్ వన్నీ గాలికబుర్లేనని లోకేశ్ విమర్శించారు.