Chinthamaneni Prabhakar: అడవుల్లో నన్ను కాల్చేస్తారనుకున్నా: చింతమనేని ప్రభాకర్
- నర్సీపట్నం వద్ద చింతమనేనిని అరెస్ట్ చేసిన పోలీసులు
- పోలీసులు భక్షకభటులుగా మారారన్న చింతమనేని
- తనకు నక్సలైట్లతో ప్రమాదం లేదని వ్యాఖ్య
పోలీసులు తనను చంపేస్తారని అనుకున్నానని టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం మధ్యాహ్నం విశాఖ జిల్లా జీకే వీధి మండలం శ్రీదారాలమ్మ అమ్మవారి ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకుని తిరిగి వస్తున్న సమయంలో నర్సీపట్నం వద్ద ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం మధ్యాహ్నం భీమడోలు సర్కిల్ ఇన్స్స్ పెక్టర్ కార్యాలయానికి తీసుకొచ్చి 41 నోటీసు ఇచ్చి, విడిచిపెట్టారు.
ఈ ఘటనపై చింతమనేని మాట్లాడుతూ, నర్సీపట్నం నుంచి తనను చింతపల్లికి తీసుకెళ్లారని తెలిపారు. తనకు అదే చివరి క్షణం అని అనుకున్నానని... ఆ దట్టమైన అడవుల్లో తనను కాల్చేసి, నక్సలైట్లు కాల్చేశారని చెపుతారేమోనని భావించానని అన్నారు. రక్షకభటులుగా ఉండాల్సిన పోలీసులు భక్షకభటులుగా మారారని మండిపడ్డారు. తనకు నక్సల్స్ తో ప్రమాదం ఉందని చెపుతున్నారని... కానీ, తనకు ప్రమాదం నక్సల్స్ తో లేదని, పోలీసులతోనే తనకు ప్రమాదమని అన్నారు. తన అరెస్ట్ వెనుక వైసీపీ కుట్ర ఉందని ఆరోపించారు.