Dasoju Sravan: అవినీతికి పాల్పడితే సొంత కొడుకునైనా ఉపేక్షించనన్న కేసీఆర్... మల్లారెడ్డిపై ఎందుకు స్పందించడంలేదు?: శ్రవణ్
- దాసోజు శ్రవణ్ మీడియా సమావేశం
- మల్లారెడ్డి తదితర మంత్రులపై ధ్వజం
- ఎవరినీ వదిలిపెట్టేది లేదని స్పష్టీకరణ
- అవినీతి భాగోతాలు బయటపెడతామని వెల్లడి
ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ తెలంగాణ మంత్రులు, టీఆర్ఎస్ నేతలపై ధ్వజమెత్తారు. మంత్రులు విచ్చలవిడిగా భూకబ్జాలకు పాల్పడుతున్నారని, వారి అక్రమాలను ఎండగడతామని స్పష్టం చేశారు. అవినీతికి పాల్పడితే సొంత కుమారుడ్నైనా ఉపేక్షించేది లేదన్న కేసీఆర్... మంత్రి మల్లారెడ్డి విషయంలో ఎందుకు స్పందించడంలేదని శ్రవణ్ ప్రశ్నించారు. మంత్రి మల్లారెడ్డి అవినీతిపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన ప్రతి ఆరోపణకు ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు.
"మల్లారెడ్డితో ఏ టీవీ చానల్ లోనైనా చర్చకు మేం సిద్ధం. లేకపోతే మల్లారెడ్డి తనకు నచ్చిన వ్యక్తిని చర్చకు పంపాలి... లేకపోతే ప్రగతి భవన్ వద్ద చర్చకైనా మేం సిద్ధం. యుద్ధం మొదలైంది. ఎవరినీ వదిలిపెట్టేది లేదు. ప్రతి ఒక్క మంత్రి మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి. మల్లారెడ్డి కావొచ్చు... మహబూబ్ నగర్ లో శ్రీనివాస్ రెడ్డి కావొచ్చు, నల్గొండలో జగదీశ్వర్ రెడ్డి కావొచ్చు, ఆదిలాబాద్ లో ఇంద్రకరణ్ రెడ్డి కావొచ్చు... ఇలా రాసుకుంటూ పోతే చాలా ఉంది. సీబీఐ, ఏసీబీలకు ఫిర్యాదు చేసి ప్రతి ఒక్కరి భాగోతాలు బయడపెడతాం" అని శ్రవణ్ స్పష్టం చేశారు.