Bhavinaben Patel: పారాలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకం.. రజతంతో సరిపెట్టుకున్న భవీనాబెన్ పటేల్
- వరుస విజయాలతో ఫైనల్‌కు
- చైనా క్రీడాకారిణి ఝౌతో జరిగిన పోరులో పరాజయం
- టేబుల్ టెన్నిస్‌లో పతకం సాధించిన తొలి ఇండియన్‌గా రికార్డు
జపాన్ రాజధాని టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకం సొంతమైంది. అద్వితీయ పోరుతో నిన్న ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి భవీనాబెన్ పటేల్ రజతం రూపంలో దేశానికి తొలి పతకం అందించింది. మహిళల సింగిల్స్ క్లాస్ 4 ఫైనల్‌లో చైనా క్రీడాకారిణి ఝౌ యింగ్‌తో ఈ ఉదయం జరిగిన పోరులో భవీనాబెన్ పరాజయం పాలై రజతంతో సరిపెట్టుకుంది. ఫలితంగా, టేబుల్ టెన్నిస్‌లో పతకం సాధించిన తొలి ఇండియన్‌గా రికార్డులెక్కింది.
మొన్న బ్రెజిల్‌కు చెందిన ఓయ్స్ డి ఒలివీరాతో జరిగిన సింగిల్స్ క్లాస్ 4 మ్యాచ్‌లో 3-0తో అద్వితీయ విజయం సాధించి క్వార్టర్స్‌లో అడుగుపెట్టిన భవీనాబెన్.. ఆ తర్వాత ప్రపంచ నంబర్ 2, రియో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత అయిన సెర్బియాకు చెందిన రాంకోవిక్‌తో జరిగిన పోరులోనూ ఘన విజయం సాధించి సెమీస్‌కు చేరుకుంది. నిన్న చైనాకు చెందిన మియావో జాంగ్‌తో జరిగిన సెమీఫైనల్‌లో 3-2తో విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది. ఫలితంగా నిన్ననే భారత్‌కు తొలి పతకం ఖాయమైంది.