Sridevi Soda Center: ‘శ్రీదేవి సోడా సెంటర్’ విడుదల సందర్భంగా కేక్ కట్ చేసిన మంత్రి అప్పలరాజు
- సినీ చరిత్రలో పలాసకు ప్రత్యేక స్థానం
- కరుణ కుమార్ ఈ సినిమా తీయడం సంతోషం: మంత్రి
- పలాస 1978 సినిమాతో దర్శకుడిగా కరుణ కుమార్ పరిచయం
‘పలాస 1978’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన దర్శకుడు కరుణ కుమార్. ఆయన దర్శకత్వంలో తాజాగా విడుదలైన చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్’. సుధీర్ బాబు హీరోగా నటించిన ఈ చిత్రం శనివారం విడుదలైంది. దీనిని పురస్కరించుకొని పలాసలోని వెంకటేశ్వర థియేటర్ వద్ద మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు కేక్ కట్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సినీ చరిత్రలో పలాసకు ప్రత్యేకమైన స్థానం ఉందన్నారు. ఏ సినిమా విడుదలైనా ఇక్కడ భారీ కలెక్షన్లు వచ్చేవని చెప్పిన ఆయన.. ఇప్పుడు ఈ ప్రాంతానికి చెందిన వాళ్లే సినిమాలు తీయడం సంతోషకరమని తెలిపారు. పలాసలోని కంట్రగడకు చెందిన కరుణ కుమార్ తెరకెక్కించిన ‘శ్రీదేవి సోడా సెంటర్’ మంచి విజయం సాధించాలని కోరుకున్నారు.
‘పలాస 1978’తో తెలుగు పరిశ్రమకు పరిచయమైన కరుణ కుమార్.. ‘శ్రీదేవి సోడా సెంటర్’తో మరింత ఖ్యాతి పెంచుకోవడం ఆనందదాయకమని అప్పలరాజు అన్నారు. పలాస అన్ని రంగాల్లో ప్రత్యేకత చాటుకుంటోందని ప్రశంసించారు. ఈ సినిమాలో పలాస వాసులు చాలా మంది నటించారు. ఈ అంశం కూడా పలాసకు పేరు తెస్తుందని అప్పలరాజు అభిప్రాయపడ్డారు. డైరెక్టర్ కరుణ కుమార్ తల్లి సరోజినమ్మకు అభినందనలు తెలిపారు.
ఇక ఈ చిత్రంలో నటించిన నటీనటులు ఈ సందర్భంగా అప్పలరాజుకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో నటులు గార రాజారావు, మల్లా భాస్కరరావు, పెంట రాజు, దువ్వాడ హేమబాబు చౌదిరి, కోత పూర్ణచంద్రరావు, పైల చిట్టి, జోగి సతీష్, దువ్వాడ మధుబాబు, ఉంగ సాయి తదితరులు పాల్గొన్నారు.