Afghanistan: జీవితాన్ని వదిలేసి.. మాతృభూమి నుంచి పారిపోతున్నా: అందరినీ కదిలిస్తున్న ఆఫ్ఘన్​ యువతి భావోద్వేగ పోస్ట్​

Afghan Photo Journalist Post Makes Every One Sad

  • చనిపోయిన ఆత్మ, కెమెరాలు తప్ప నావద్ద ఇంకేం లేవు
  • సున్నా నుంచి జీవితాన్ని మొదలుపెడుతున్నా
  • ఐదు రోజుల క్రితం ఫ్రాన్స్ చేరిన ఫొటో జర్నలిస్ట్

ఆ యువతి ఓ ఫొటో జర్నలిస్ట్. సినిమాలూ తీస్తుంటుది. జీవితంపై ఎన్నో ఆశలు.. ఎన్నెన్నో కలలు! కానీ, అవన్నీ తాలిబన్ల రాకతోనే సమాధయ్యాయి. ఆఫ్ఘన్లందరిలాగానే ఆమె కూడా దేశం నుంచి వెళ్లిపోవాలనుకుంది. ‘జీవితాన్ని వదిలేసి’ కాబూల్ ఎయిర్ పోర్టుకు చేరుకుంది. ఎలాగోలా ఓ విమానమెక్కింది. కొన్ని రోజుల క్రితం ఫ్రాన్స్ లో దిగింది. రోయా హైదరీ అనే ఆ యువతి పెట్టిన ఓ పోస్ట్ ఇప్పుడు అందరినీ కలచివేస్తోంది.

‘‘నా గళాన్ని వినిపించేందుకు.. నా జీవితాన్ని, ఇంటిని వదిలేసి వెళ్తున్నా. మరోసారి నేను నా మాతృభూమి నుంచి పారిపోతున్నా. మరోసారి సున్నా నుంచి జీవితాన్ని మొదలుపెట్టబోతున్నా. చచ్చిపోయిన నా ఆత్మ, నా కెమెరాలు తప్ప నా వద్ద ఇంకేమీ లేవు. మళ్లీ వచ్చేంత వరకు మాతృభూమికి భారమైన హృదయంతో ఇదే నా వీడ్కోలు’’ అని ఆమె ట్వీట్ చేసింది. ఆ పోస్ట్ కు కాబూల్ ఎయిర్ పోర్టులో ఆమె దీనంగా కూర్చున్న ఫొటోను జత చేసింది.


‘‘ఎప్పుడూ నేను గొంతెత్తూనే ఉంటా. నా గుండెల్లోని బాధ నన్ను మరింత పటిష్ఠంగా మారుస్తోంది. ఈ యుద్ధం కన్నా నా కళ చాలా గట్టిది. ఈ పిరికిపందల కన్నా నా ప్రజలు చాలా శక్తిమంతులు. నా దేశం మళ్లీ నిలబడుతుంది. నా ప్రజల కోసం.. నా ఇంటి కోసం.. ఆఫ్ఘనిస్థాన్ కోసం’’ అన్న జబీహుల్లా కవితను ఆమె పోస్ట్ చేసింది.

ఐదు రోజుల క్రితం ఫ్రాన్స్ కు చేరుకున్న ఆమె.. చావు ఒకసారే వస్తుందని, తాలిబన్లు తనను చంపినా భయపడనని తెలిపింది. అయితే, అక్కడ మళ్లీ పంజరంలో బందీ కావల్సి వస్తుందన్న భయంతోనే దేశం నుంచి పారిపోయి వచ్చానని తెలిపింది. వివిధ దేశాల ప్రతినిధులు ఆమెకు అండగా నిలుస్తూ సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News