Afghanistan: పనిచేసే మహిళలపై తాలిబన్ల ఆంక్షలు!
- ఇల్లు విడిచి వెళ్లొద్దని ఆదేశాలు
- కొన్ని రోజులేనన్న తాలిబన్ ప్రతినిధి
- వారి భద్రత కోసమేనని వెల్లడి
బయట పనిచేసే మహిళలెవరూ ఇల్లు విడిచి వెళ్లొద్దని, ఇంట్లోనే ఉండాలని తాలిబన్లు ఆదేశాలు జారీ చేశారు. అయితే, అది కొన్నాళ్లు మాత్రమేనని తాలిబన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ చెప్పారు. మహిళలు పనిచేసే ప్రదేశాల్లో అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకునేంత వరకు ఇంట్లో ఉండాలని సూచించారు. ప్రభుత్వ మహిళా అధికారుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.
ఇంతకుముందులాగానే ఇప్పుడూ మహిళలపై తాలిబన్లు ఆంక్షలు విధిస్తారన్న భయాల మధ్యే తాలిబన్లు ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడం ఆఫ్ఘన్ మహిళలను ఆందోళనకు గురి చేస్తోంది. మహిళలపై ఆంక్షలు విధించబోమని, షరియా చట్టానికి లోబడి వారికి అవకాశమిస్తామని తాలిబన్లు ఇప్పటికే ప్రకటించినా దానిపై నీలి నీడలు కమ్ముకున్నాయి. అయితే, తాము ప్రతీకారం తీర్చుకోవడానికి రాలేదని, అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తామని ముజాహిద్ చెబుతున్నారు.