Afghanistan: ఆఫ్ఘన్ భూభాగం ఉగ్రవాదుల అడ్డా కాకూడదు: భారత్

Afghan territory should not be a haven for terrorists

  • ఐక్యరాజ్యసమితి మానవహక్కుల సమితిలో భారత ప్రతినిధి వ్యాఖ్యలు
  • ఆఫ్ఘనిస్థాన్‌లో భయంకరమైన మానవ హక్కుల సంక్షోభం
  • ఆఫ్ఘన్ల ప్రాథమిక హక్కులను కాలరాయడంపై ఆందోళన

ఆగస్టు 15న ఆఫ్ఘనిస్థాన్‌ను తాలిబన్లు పూర్తిగా హస్తగతం చేసుకున్నారు. ఈ క్రమంలో ఆప్ఘన్ ప్రజలు భయంతో బెంబేలెత్తుతున్నారు. దీనిపై చర్చించేందుకు ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సమితి ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ వేదికపై భారత ప్రతినిధి ఇంద్రమణి పాండే మాట్లాడుతూ.. ఆఫ్ఘనిస్థాన్‌లో ప్రజల ప్రాథమిక హక్కులను కాలరాయడంపై ఆందోళన వ్యక్తంచేశారు.

ఈ సందర్భంగా ఆఫ్ఘనిస్థాన్ ప్రజలకు మద్దతుగా నిలవాలని ప్రపంచ దేశాలను ఆయన కోరారు. ఆఫ్ఘన్ భూభాగం జైషే మహ్మద్, లష్కర్-ఏ-తాయిబా వంటి ఉగ్రవాద ముఠాలకు అడ్డాగా మారకూడదని కోరుకుంటున్నట్లు ఆయన చెప్పారు. ఆఫ్ఘనిస్థాన్‌లో భయంకరమైన మానవ హక్కుల సంక్షోభం తలెత్తిందని పాండే అభిప్రాయపడ్డారు.

సాధ్యమైనంత త్వరగా ఆఫ్ఘన్ భూభాగంలో పరిస్థితులు చల్లబడాలని భారత్ కోరుకుంటున్నట్లు పాండే చెప్పారు. ప్రస్తుత పరిస్థితితో సంబంధాలున్న వర్గాలు ఈ ప్రాంతంలోని ప్రజల మానవీయ, భద్రతా సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు. ఆఫ్ఘన్ సమాజంలోని అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం వహించే ప్రభుత్వం ఏర్పాటు కావాలని భారత్ ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఆఫ్ఘన్ మహిళల స్వరం, పిల్లల కలలు, మైనార్టీల హక్కులను గౌరవించాలని సూచించారు.

  • Loading...

More Telugu News